
సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి త్వరలో రాబోతున్న చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కి జోడిగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన 'కావాలి' అనే సాంగ్ యూట్యూబ్ లో పెను సంచలనంగా మారింది. ఆగష్టు 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న జైలర్ ట్రైలర్ వచ్చేసింది. డైరెక్టర్ నెల్సన్ నుంచి ఊహించినట్లుగానే ఇది కూడా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీనే. అయితే ట్రైలర్ లో ప్రతి ప్రేములో రజనీ తనదైన శైలిలో అదరగొట్టేశాడు. బీస్ట్ చిత్రంలో ఎవర్రా నువ్వు ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నావు' డైలాగ్ తో ఫేమస్ అయిన నటుడు గణేష్ జనార్దనన్ జైలర్ లో కూడా నటించారు. ట్రైలర్ లో రజనీకాంత్ పాత్రని పరిచయం చేస్తోంది అతనే.
'ఈ డిసీజ్ ఉన్నవాళ్లు పిల్లిళ్లలాగా ఉంటారు' అని రజనీకాంత్ పాత్ర గురించి చెబుతారు. రజనీకాంత్ అమాయకంగా నటిస్తూ కనిపిస్తారు. 'కానీ ధడేల్ మని పులిలాగా మారిపోతారు' అని చెప్పిన వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ విశ్వరూపం మొదలవుతుంది. అమాయకంగా ఇంట్లో పనులన్నీ చేసే రజని ఒక్కసారిగా ఎందుకు ఉగ్రరూపంలోకి మారాడు అనేది ఆయన ఫ్యామిలీకి కూడా సస్పెన్స్.
రమ్యకృష్ణ రజని భార్యగా కనిపిస్తోంది. 'ఒకరేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవు.. కోతలే, చాలా దూరం వెళ్లాను.. ఫుల్లుగా పూర్తి చేస్తేకానీ రాను అని రజని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అసలు రజనీకాంత్ కి మాఫియాకి మధ్య ఏం జరిగింది అనే ఉత్కంఠ ట్రైలర్ కలిగిస్తోంది. ట్రైలర్ లో యాక్షన్ స్టంట్స్, గన్ ఫైట్స్,బ్లాస్టింగ్స్ మెండుగా ఉన్నాయి. ఓవరాల్ గా జైలర్ ట్రైలర్ కిర్రాక్ అనే చెప్పాలి.