
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ తన భర్త, చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్‌తో కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లోనే ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుండి వారికి మంగళవారం అఫీషియల్‌గా విడాకులు మంజూరయ్యాయి.
సౌందర్య-అశ్విన్ వివాహం 2010లో జరిగింది. దాదాపు ఐదేళ్ల పాటు అన్యోన్య దాంపత్యం సాగించారు. 2015లో వారికి ఒక బిడ్డ పుట్టాడు. కొడుకు తొలి పుట్టినరోజు సందర్భంగా ఏర్పడిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పెను దుమారానికి దారితీసింది. ఆ సందర్భంలో జరిగిన చిన్న ఘటన చివరకు పెద్ద గొడవకు దారి తీసి ఇద్దరూ విడిపోయే పరిస్థితులకు దారితీసింది. రజనీ కుటుంబ సభ్యులు ఇద్దరినీ కలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్న సౌందర్య, ప్రస్తుతం సినిమానే తన కెరీర్ గా ఎంచుకుని ముందుకు సాగుతోంది. సౌందర్య రజినీకాంత్ 'కొచ్చాడియన్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా వీఐపీ2 సినిమాకు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.