శ్రీదేవి వేసిన పెయింటింగ్స్ దుబయిలో వేలం

First Published Mar 1, 2018, 5:34 PM IST
Highlights
  • అర్థ శతాబ్దంపాటు భారతీయ వెండితెరను ఏలిన శ్రీదేవి
  • అతిలోక సుందరికి నటనతోపాటు పెయింటింగ్స్ పైనా మక్కువ
  • శ్రీదేవి వేసిన సోనమ్, మైకేల్ జాక్సన్ పెయింటింగ్స్ దుబయిలో వేలం

అర్థ శతాబ్దంపాటు వెండితెరపై మకుటంలేని మహారాణిగా వెలిగిపోయిన అతిలోక సుందరికి నటనపై ఎంతటి మక్కువ వుందో పెయింటింగ్ పైన అంతకంటే ఎక్కువ ఆసక్తి వుంది. నటిగా ఆలిండియా తొలి లేడీ సూపర్‌స్టార్‌ గా వున్న శ్రీదేవి, ఖాళీ సమయంలో పెయింటింగ్‌ వేస్తూ గడిపేవారు. అనిల్ కపూర్ తనయ సోనమ్‌ కపూర్‌ తొలి చిత్రం సావరియాలో ఓ ఫోటో శ్రీదేవికి నచ్చడంతో దానిని పెయింటింగ్ గీశారు. ఈ పెయింటింగ్‌‌తో పాటు పాప్‌స్టార్‌ మైఖెల్‌ జాక్సన్‌ చిత్రాన్ని అతిలోక సుందరి అద్భుతంగా వేశారు.


దివంగత శ్రీదేవి వేసిన ఈ రెండు పెయింటింగ్స్ ను దుబాయ్‌లో వేలానికి పెట్టనున్నారు. శ్రీదేవి గతంలో వేసిన పెయింటింగ్‌లు నచ్చి దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ ఆర్ట్‌ హౌస్‌ 2010లో ఆమెను సంప్రదించింది. ఈ పెయింటింగ్‌లను వేలానికి పెట్టాల్సిందిగా కోరారు. కానీ మొదట్లో శ్రీదేవి అందుకు నిరాకరించారు. వేలంలో వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తామని చెప్పడంతో చివరకు ఆమె అంగీకరించారు. తాను వేసిన పెయింటింగ్‌లో మైఖెల్‌ జాక్సన్‌ది చాలా ఇష్టమని ఓసారి శ్రీదేవి స్వయంగా వెల్లడించారట. ఈ ఒక్క పెయింటింగ్‌ ప్రారంభం ధరను రూ.8 నుంచి రూ.10 లక్షలుగా నిర్ణయించి, వేలానికి పెట్టనున్నారు.

మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహ వేడుక కోసం దుబయ్ వెళ్లిన శ్రీదేవి హోటల్‌ గదిలోని ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి గత శనివారం ప్రాణాలు కోల్పోయారు. బాలనటిగా నాలుగో ఏటనే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీదేవి, అనంతరం కథానాయకిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమను శాసించారు. బాలీవుడ్‌లో రెండు దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగి నటనలో తనకు తానే సాటని నిరూపించుకున్నారు. భౌతికంగా ఆమె వదిలి వెళ్లినా వెండితెరపై ఆమె ఙ్ఞ‌ాపకాలు కలకాలం నిలిచిపోతాయి.

click me!