
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లు తనను హగ్ అడుగుతున్నారని నిర్మాత దిల్ రాజు చాలా గొప్పగా చెప్పుకున్నాడు.
ఇక సినిమా సక్సెస్ మీట్ తరువాత మహేష్ ఆ ఆనందంలో దర్శకుడు వంశీ పైడిపల్లికి ఏకంగా ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ ఇలా దర్శకుడికి ముద్దివ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఆయన్ని అంతగా ఈ సినిమా ఎగ్జైట్ చేసింది.
అయితే ఈ ముద్దుపై నటుడు ఎస్.జె.సూర్య కొన్ని కామెంట్స్ చేశారు. మహేష్ నటించిన 'స్పైడర్' సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు ఎస్.జె.సూర్య. తాజాగా మహేష్, వంశీకి ముద్దు పెట్టిన ఫోటో చూసిన సూర్య.. మహేష్ ముద్దు ఎంత నిజాయితీగా ఉంటుందో తనకు వ్యక్తిగతంగా తెలుసునని అన్నాడు.
సినిమా పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటడానికే ఇచ్చినట్లు సినిమా చూసిన తరువాత తనకు అర్ధమైందని అన్నారు. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి ఫీలింగ్ కలిగిస్తున్నందుకు మహేష్, వంశీలకు థాంక్స్ చెప్పాడు సూర్య. 'స్పైడర్' సినిమాతో మహేష్ తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ కారణంగానే అక్కడి జనాలు కూడా ఈ సినిమాను బాగానే చూస్తున్నారు.