
వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ కి సీతారామం, బింబిసార, కార్తికేయ 2 ఊపిరి పోశాయి. ప్రేక్షకులను థియేటర్స్ కి నడిపించాయి. ముఖ్యంగా సీతారామం క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. క్రిటిక్స్, ప్రేక్షకులు సీతారామం ని అద్భుత ప్రేమ కావ్యం గా వర్ణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో సీతారామం రికార్డు వసూళ్లు రాబట్టింది. భారీ లాభాలు పంచింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ సీతారామం మేనియా నుండి ప్రేక్షకులు భయపడలేదు. చెప్పుకోదగ్గ చిత్రాల విడుదల లేకపోవడంతో మంచి ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ వారం సీతారామం హిందీ వర్షన్ విడుదల చేశారు. హిందీలో కూడా చిత్రానికి అద్భుత రెస్పాన్స్ దక్కుతుంది. డే బై డే కలెక్షన్స్ పెరుగుతూ పోవడమే దానికి నిదర్శనం. ఫస్ట్ డే సీతారామం హిందీ రూ. 30 లక్షల నెట్ వసూళ్లు అందుకుంది. రెండో రోజూ అది రెట్టింపు అయ్యింది. సెకండ్ డే సీతారామం రూ. 70 లక్షల వసూళ్లతో రూ.1 కోటి మార్కు చేరుకుంది. సర్వత్రా పాజిటివ్ టాక్ వస్తుండగా మూడో రోజు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కార్తికేయ సైతం ఇలాగే మెల్లగా మొదలైన సంచలనం నమోదు చేసింది. కార్తికేయ 2 హిందీ వర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం రూ. 7 లక్షలు. అంత పూర్ ఓపెనింగ్స్ తో మొదలైన ఆ చిత్రం రూ. 26 కోట్ల మార్క్ దాటేసింది. సీతారామం కూడా లాంగ్ రన్ లో అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. బాలీవుడ్ క్రిటిక్స్ సీతారామం చిత్రాన్ని గ్రేట్ లవ్ స్టోరీగా కొనియాడుతున్నారు. పాజిటివ్ ట్రెండ్ చూస్తే టాలీవుడ్ నుండి పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కార్తికేయ 2 తర్వాత సీతారామం మరో సంచలనం నమోదు చేసేలా ఉంది.
దర్శకుడు హను రాఘవపూడి కథ, స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశాయి. ముఖ్యంగా హను గొప్ప దర్శకుడని నిరూపించుకున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ సీతారామం చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందాన, సుమంత్ కీలక రోల్స్ చేశారు.