పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పాటల ప్రవాహం ఆగిపోయింది. పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry Dead) (66)కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం కన్నుమూసినట్టు తెలుస్తుంది.
దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. Sirivennela Seetharama Sastry Dead మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. తెలుగు చిత్ర సీమలో ఇదొకి చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు. సిరివెన్నెల మరణంగా టాలీవుడ్‌కి, సినీ సాహిత్య రంగానికి తీరని లోటని తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. మే 20, 1955న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో డాక్టర్ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి గార్లకి సిరివెన్నెల జన్మించారు. అనకాపల్లిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియన్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో బి.ఏ పూర్తి చేశారు. ఎం.ఏ చేస్తుండగా, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.విశ్వనాథ్.. `సిరివెన్నెల` సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. అలా 1986లో సిరివెన్నెల కెరీర్ ప్రారంభమైంది. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కానీ తొలి చిత్రం `సిరివెన్నెల`నే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాశారు సిరివెన్నెల. `విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` సిరివెన్నెల రాసిన తొలిపాట. చివరగా ఆయన అఖిల్ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంలో `చిట్టు అడుగు` అనే పాటని రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటలరచయిత మాత్రమే కాదు, కవి, సింగర్ కూడా. `గాయం` సినిమాలో `నిగ్గ దీసి అడుగు.. `అనే పాట ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. జనాన్ని చైతన్య పరిచే ఈ పాట ఊర్రూతలూగించింది. గాయకుడిగా సిరివెన్నెలలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.
సిరివెన్నెల సినీ సాహిత్యానికి చేసిన సేవలకుగానూ `2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దాదాపు 11 నంది అవార్డులు అందుకున్నారు. `సిరివెన్నెల`, `శృతి లయలు`, `స్వర్ణకమలం`, `గాయం`, `సుభలగ్నం`, `శ్రీకారం`, `సింధూరం`, `ప్రేమ కత`, `చక్రం`, `గమ్యం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి చిత్రాల్లోని పాటలకు అవార్డులు అందుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌తో సిరివెన్నెలకి మధ్య మంచి అనుబంధం ఉంది. విశ్వనాథ్ సినిమాల్లో సిరివెన్నెల రాసిన పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్.