
ధనుష్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తొలి చిత్రం `సార్`. తెలుగు, తమిళంలో బైలింగ్వల్(తమిళంలో `వాతి`) మూవీగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. రేపు(గురువారం) ధనుష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఒక్క రోజు ముందుగానే ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసింది యూనిట్. `సర్` ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
ఫస్ట్ లుక్‌లో ధనుష్ లైబ్రరీలో కూర్చొని ఎంతో ఇంట్రెస్ట్ గా రాసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. లుక్ చాలా ఆకట్టుకోవడంతోపాటు ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. అంతకు ముందు విడుదల చేసిన ప్రీ లుక్‌లో ధనుష్ క్లాస్ రూమ్‌లో టీచింగ్ చేస్తున్నట్టుగా ఉన్న విషయం తెలిసిందే. మరి లేటెస్ట్ ఫస్ట్ లుక్‌లో ఆయన ఏం రాసుకుంటున్నారు? ఏం చేయబోతున్నారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం `సార్` ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
మరోవైపు రేపు (జులై 28) మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు తెలుగు, తమిళంలో టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఇందులో ధనుష్‌కి జోడీగా `భీమ్లా నాయక్` ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, `సార్` చిత్రంలో ధనుష్ లెక్చరర్‌గా కనిపిస్తారని తెలిపారు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో జరిగే కథ అన్నారు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్, రేపు రిలీజ్ కానున్న టీజర్ సినిమాలోని కథాంశాన్ని, ధనుష్ పాత్రని రివీల్ చేస్తాయన్నారు.
`తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోంది చిత్రం. దీనికి తగినట్లుగా ధనుష్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనిది. అలాగే జి వి ప్రకాష్ గారి సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి` అని దర్శకుడు తెలిపారు. `సార్` అక్టోబర్ లో విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు తెలిపారు నిర్మాత నాగవంశీ.
ఇందులో ధనుష్, సంయుక్త మీనన్‌లతోపాటు సాయికుమార్,తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.