మంగ్లీ ప్రమాదంలో ట్విస్ట్... వైరల్ గా స్టార్ సింగర్ సోషల్ మీడియా పోస్ట్!

By Sambi ReddyFirst Published Mar 18, 2024, 6:07 PM IST
Highlights

మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని వార్తలు వస్తుండగా... ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు వివరణ ఇచ్చారు. పుకార్లు నమ్మవద్దని అభిమానులకు విన్నపం చేశారు. 
 

స్టార్ సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. డీసీఎం వాహనం వెనకనుండి మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో మంగ్లీతో పాటు మరొక ఇద్దరు కారులో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా శంషాబాద్ మండలం తొండుపల్లి బ్రిడ్జి వద్ద డీసీఎం వాహనం మంగ్లీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

కారు వెనుక భాగం డామేజ్ అయినట్లు సమాచారం. డీసీఎం డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడట. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ప్రమాదం పై పలు రకాల రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో మంగ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రమాదం పై వివరణ ఇచ్చారు. 

''డియర్ ఆల్... నేను క్షేమంగా ఉన్నాను. నాకు ఏం కాలేదు. ఇటీవల అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగింది. ప్రచారం అవుతున్న పుకార్లను నమ్మవద్దు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు... ఇట్లు మీ మంగ్లీ'' సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశారు. ప్రచారం అవుతున్నట్లు తనకేమీ కాలేదని. అది చిన్న ప్రమాదం అని మంగ్లీ స్పష్టత ఇచ్చారు. పుకార్లు నమ్మి అభిమానులు ఆందోళన చెందకండని ఆమె పరోక్షంగా వెల్లడించారు. 

టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో మంగ్లీ ఒకరు. కొన్నేళ్లుగా ఆమె హవా నడుస్తుంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మంగ్లీ తన విలక్షణమైన వాయిస్ తో సంగీత ప్రియులను ఓలలాడిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆమె పాడారు. మంగ్లీ బతుకమ్మ, శివరాత్రి పాటలు ప్రత్యేకంగా రూపొందించి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. మంగ్లీ సాంగ్స్ కి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. 

click me!