
సాధారణంగా సినిమా షూటింగ్‌లో జరిగి ప్రమాదాల్లో హీరోలు గాయపడటం చూస్తుంటాం. కానీ ఓ సినిమా షూటింగ్ సందర్భంగా బైక్ మీద నుంచి పడి హీరోయిన్ గాయపడింది. ఈ రోజు (గురువారం) నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కృష్ణ అండ్ హిజ్ లీలా. చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఫైనల్‌గా డిజిటల్ ప్లాట్ ఫాంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ సినిమా షూటింగ్ నాటి ఎక్స్ పీరియన్స్‌ను గుర్తు చేసుకుంది. 2017లో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది శ్రద్ధా. ఆ సమయంలో ఓ సన్నివేశంలో బైక్ నడపాల్సి ఉండగా బైక్ నడుపుతూ కింద పడిపోయింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్, ఆ సంఘటనను వివరించింది.
`జూన్ 2017లో నందిహిల్స్‌లో షూటింగ్ జరుగుతోంది. సెట్‌లో చాలా మంది ఉన్నారు. రోడ్లంతా తడి ఉన్నాయి. ఆ సమయంలో దర్శకుడు రవికిరణ్ చెరుపూరి నా దగ్గరకు వచ్చి బైక్ నడపడం వచ్చా అని అడిగారు. నాకు రాదు కానీ ట్రై చేస్తా అని చెప్పా. చిన్నతనంలో బైక్ నేర్చుకున్నా కానీ ప్రాక్టీస్ లేదు. అయినా ధైర్యంగా బైక్ ఎక్కా. అది బుల్లెట్ కావటంతో బ్యాలెన్స్ చేయలేక కిందపడిపోయా. ఈ సంఘటనను నా అసిస్టెంట్ ప్రశాంత్ వీడియో తీశాడు. రాయల్ ఎన్‌ఫిల్డ్ ఎందుకు అంత బరువుగా ఉంటుంది` అంటూ కామెంట్ చేసింది శ్రద్ధా శ్రీనాథ్.
సాండల్‌వుడ్ లో పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది శ్రద్ధా. తెలుగు సమంత హీరోయిన్‌గా నటించిన యూ టర్న్ సినిమా ఒరిజినల్ వర్షన్ లో హీరోయిన్‌గా నటించింది శ్రద్ధానే. ఇటీవల నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.