
`దసరా` సినిమిలో నానికి విలన్‌గా, బాలయ్య `డాకు మహారాజ్`లో కీలక పాత్రలో నటించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి సి.బి. చాకో మరణించారు. షైన్ టామ్, అతని కుటుంబం ప్రయాణిస్తున్న కారు ధర్మపురి దగ్గర ప్రమాదానికి గురైంది.
శుక్రవారం తెల్లవారుజామున త్రిసూర్ నుండి బెంగళూరు వెళ్తుండగా ధర్మపురి పక్కనే ఉన్న పారయూర్‌లో సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో షైన్ టామ్, అతని తండ్రి, తల్లి, సోదరుడు, అసిస్టెంట్ ఉన్నారు.
షైన్ టామ్, అతని కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో షైన్ తండ్రి అక్కడికక్కడే మరణించారు.
షైన్ టామ్ చేతికి గాయమైంది. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు కలిసి ధర్మపురిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎవరు కారు నడుపుతున్నారో తెలియరాలేదు.
నిన్న రాత్రి త్రిసూర్ నుండి బెంగళూరుకు బయలుదేరారు. వైద్య పరీక్షల కోసం షైన్ టామ్ చాకో తన తల్లిదండ్రులను బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నటుడు షైన్ టామ్ చాకో మలయాళంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ నటించిన `బీస్ట్` సినిమా ద్వారా కోలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఇటీవల అజిత్ నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాలో నటించారు. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల కేసులో షైన్ టామ్ చాకో అరెస్టయి, తరువాత విడుదలయ్యారు.
`దసరా` చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు షైన్ టామ్ చాకో. ఇందులో నానికి విలన్‌గా చేశాడు. ఈ మూవీతోనే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులోనూ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల బాలకృష్ణ హీరోగా వచ్చిన `డాకు మహారాజ్` చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించి మెప్పించారు. దీంతోపాటు `రంగబలి`, `దేవర` , `రాబిన్‌హుడ్` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు షైన్ టామ్ చాకో.