
దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో ఈ సినిమా కోసం ఎదురుచూశారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళనాడులో చాలా చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన అభిమానులను ఆనందంతో ఊగిపోతున్నారు. తమ బాస్ రజినీకాంత్ హిట్ కొట్టేశాడని సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు.
చిట్టి ఎంట్రీ అదిరిపోయిందని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరచలేదని, రజిని-అక్షయ్ ల నటన ఎన్నో ఏళ్లు గుర్తుండిపోతుందని అంటున్నారు. రెహ్మాన్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని, వీఎఫ్ఎక్స్ వర్క్ అధ్బుతమని కొనియాడుతున్నారు.
ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించిన ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. శంకర్ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తీశారని, హాలీవుడ్ మీకోసం ఎదురుచూస్తోందని దర్శకుడు శంకర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.