
సౌత్ లో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోయిన్లలో సమంత ఒకరు. సమంత నేడు ఏప్రిల్ 28న తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దీనితో సమంతకి అభిమానుల నుంచి, సెలబ్రిటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సమంత ఏ మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్లుగా సమంత క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది.
ఈ ప్రయాణంలో సమంత జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నీ జరిగాయి. అనారోగ్య సమస్యలతో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నటిగా మాత్రం వెనకడుగు వేయకుండా రాణిస్తోంది. తెలుగులో సమంత దూకుడు, బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, ఓ బేబీ, అ..ఆ, రంగస్థలం లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది.
విపరీతమైన క్రేజ్ ఉన్న సినీ తారల్ని అభిమానులు దైవాలుగా ఆరాధిస్తుంటారు. హీరోయిన్ల కోసం అభిమానులు దేవాలయాలు నిర్మించిన సంఘటనలు కూడా చూశాం. ఖుష్బూ, హన్సిక, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లకు ఫ్యాన్స్ టెంపుల్స్ నిర్మించారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో ఓ వీరాభిమాని సమంత కోసం టెంపుల్ నిర్మించాడు.
అయితే ఈ టెంపుల్ 2023లోనే నిర్మించినది. కాగా నేడు సామ్ బర్త్ డే సందర్భంగా ఆ గుడిలో సమంత బంగారు కలర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. సమంత విగ్రహానికి పూజలు నిర్వహించిన అభిమాని కేక్ కట్ చేసి ఆమె బర్త్ డే సెలెబ్రేట్ చేశారు. అనాథ పిల్లలకు భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. సమంత నటిగా మాత్రమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకే ఆమెకి అభిమాని అయినట్లు అతడు తెలిపాడు.
సినిమాల విషయానికి వస్తే సమంత నిర్మాతగా మారింది. శుభం అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ మే 9న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత చివరగా తెలుగులో ఖుషి చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి చిత్రానికి సైన్ చేయలేదు.