
ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా బాగా రాణిస్తున్నాయి. ముఖ్యంగా నయనతార, సమంత, అనుష్క లాంటి హీరోయిన్లు ఫిమేల్ సెంట్రిక్ కథల్లో నటిస్తే స్టార్ హీరోల రేంజ్ లో వసూళ్లు రాబట్టడం చూస్తూనే ఉన్నాం. సౌత్ లో నయనతారకి ఉన్న క్రేజే వేరు. లేడీ సూపర్ స్టార్ గా నయన్ తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకుంది.
రీసెంట్ గా నయనతార నటించిన చిత్రం కనెక్ట్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం లో విఫలం అయింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ నయన్ క్రేజ్ ని తప్పు పట్టలేం. తాజాగా సమంత.. నయన్ క్రేజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ నెటిజన్ నయనతార కనెక్ట్ చిత్రం కోసం ఏర్పాటు చేసిన భారీ బ్యానర్స్, హోర్డింగులని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఒక హీరోయిన్ చిత్రానికి ఈ స్థాయిలో హోర్డింగులు ఏర్పాటు చేయడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం ఈ పరిస్థితి హీరోయిన్లకు లేదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు ధీటుగా హీరోయిన్ చిత్రాలు వస్తున్నాయి అంటూ సదరు నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిపై సమంత స్పందించింది. 'మహిళలు ఎదుగుతున్నారు' అంటూ కామెంట్ పెట్టింది.
నయనతార, సమంత మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ గత ఏడాది 'కన్మణి రాంబో ఖతీజ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్ర సమయంలో నయన్, సమంత మధ్య బంధాన్ని అంతా చూశారు. ఇక సమంత కూడా ఫిమేల్ సెంట్రిక్ కథల్లో ఎక్కువగా నటిస్తోంది. సమంత చివరగా నటించిన యశోద చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సమంత మాయోసైటిస్ నుంచి కోలుకుంటోంది. అయితే సమంత తిరిగి ఎప్పటి నుంచి షూటింగ్స్ లో పాల్గొంటుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సమంత.. విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది.