
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే సుకుమార్ పేరు చెప్పాల్సిందే. ఆ పేరుకి ప్రతిరూపంగా నిలుస్తుంటారు. క్రియేటివ్ జీనియస్‌గా రాణిస్తున్నారు. `రంగస్థలం`, `పుష్ప` చిత్రాలతో సంచలన విజయాలను అందుకుని టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లో ఒకరిగా నిలిచారు సుకుమార్. ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చోటుసంపాదించారు. అయితే ఆయన కొన్ని సార్లు గజినీలాగానూ మారిపోతుంటారు. కొన్ని విషయాలను, పేర్లు మర్చిపోతుంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు ఈవెంట్లలో చెబుతుంటారు. ఇప్పుడు ఏకంగా రష్మిక మందన్నా పేరే మర్చిపోయారు.
రష్మిక మందన్నా.. శర్వానంద్‌తో కలిసి నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పా కళావేదికలో జరిగింది. దీనికి సుకుమార్‌తోపాటు హీరోయిన్లు సాయిపల్లవి, కీర్తిసురేష్ గెస్ట్ లుగా వచ్చారు. సుకుమార్ మాట్లాడుతూ, రష్మికని నీ పేరేంటి? అని స్టేజ్‌పై ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే రష్మిక మందన్నా అంటూ ఆయనే చెప్పడం నవ్వులు పూయించింది. సుకుమార్ అన్న మాటలకు రష్మికతోపాటు స్టేజ్‌పై ఉన్న వాళ్లంతా ఘోళ్లున్న నవ్వారు. రష్మికతో `పుష్ప` సినిమా చేసిన ఆయన ఆమె పేరే మర్చిపోవడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే దీన్ని అంతా సరదాగా తీసుకోవడం విశేషం.
మరోవైపు సమంతపై హాట్ కామెంట్ చేశారు సుకుమార్. ఆమె లేడీ గ్యాంగ్‌లీడర్ అంటూ కామెంట్ చేశారు. సాయిపల్లవి, కీర్తిసురేష్, రష్మిక మందన్నా, సమంత బ్యూటీఫుల్, ది బెస్ట్ యాక్ట్రెస్ అని తెలిపారు. అయితే వీరి గ్యాంగ్‌కి సమంత లీడర్ అని, ఆ గ్యాంగ్ లీడర్ మిస్సింగ్ అంటూ కామెంట్ చేశారు సుకుమార్. సమంతని గ్యాంగ్ లీడర్ గా పోల్చడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి సమంత ఆ పొజిషన్‌కి అర్హురాలే అని చెప్పొచ్చు. రష్మిక, సాయిపల్లవి, కీర్తిసురేష్‌లలో ఆమె సీనియర్. బెస్ట్ యాక్టర్ కూడా. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. సుకుమార్ రూపొందించిన `రంగస్థలం` చిత్రంలో రామలక్ష్మీగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. పల్లెటూరి అమ్మాయి పాత్రకి ప్రాణం పోసింది. అందుకే సుకుమార్ ఆమెని అభినందించారని చెప్పొచ్చు. అదే సమయంలో కొత్త చర్చకి తెరలేపారని చెప్పొచ్చు.
`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఈవెంట్‌లో సుకుమార్ స్పీచ్ ఆద్యంతం నవ్వులు పూయించడం విశేషం. మొదట యాంకర్ సుమని ఆయన అభినందించారు. నా ఫేవరేట్ హీరోయిన్ సుమగారు అంటూ ప్రశంసలు కురిపించారు. స్టేజ్‌పై యాక్టింగ్ చేస్తున్న మీకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఇక శర్వానంద్, రష్మిక జంటగా, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఝాన్సీ వంటివారు ప్రధాన పాత్రలు పోషించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.చెరుకూరిసుధాకర్ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కాబోతుంది.