
ప్రభాస్ తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. త్వరలో `ఆదిపురుష్` సినిమా రిలీజ్ కావడమే కాదు, `సలార్` నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుంది. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. `ఆదిపురుష్` సినిమాతోపాటు `సలార్` టీజర్ రాబోతుందనేది ఈ అప్‌డేట్ సారాంశం. జూన్ 16న `ఆదిపురుష్` సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లలో సినిమా మధ్యలో `సలార్` టీజర్‌ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ టీమ్ ఆ ప్లాన్‌లో ఉన్నారట.
ఇదిలా ఉంటే `సలార్` టీజర్‌ని ఏడాది క్రితమే ప్లాన్ చేశారట. గతేడాది ఏప్రిల్‌లోనే టీజర్ రెడీ అయినట్టు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ వైరల్ అవుతుంది. ఏప్రిల్ 13న ఈ టీజర్ సర్టిఫికేట్ ఫైనల్ చేశారు. ఇందులో టీజర్ నిడివి 1.31 నిమిషాలు ఉంది. 91 సెకన్లపాటు ఈ టీజర్ ఉండబోతుంది. అయితే ఇప్పుడు `ఆదిపురుష్` సినిమాతో రిలీజ్ చేసే టీజర్ పాతదేనా? లేక కొత్తగా కట్ చేస్తారా? అనేది ఆసక్తి నెలకొంది. దీనిపై దర్శకుడు ప్రశాంత్ నీల్ టీమ్ వర్క్ చేస్తుందట. మొత్తానికి జూన్ 16న ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఉండబోతుందని చెప్పొచ్చు. ఓ వైపు `ఆదిపురుష్` సినిమాతో, మరోవైపు `సలార్` టీజర్‌తో వాళ్లు పండగ చేసుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `సలార్` చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ రోల్ చేస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు మూడువందల యాబై కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే క్లైమాక్స్ కోసం గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ క్లైమాక్స్ ను దాదాపు 400 మందితో చేయబోతున్నారట. అంత మందితో క్లైమాక్స్ సీన్ అంటే.. ఆ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ.. ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ప్రభాస్ మరోవైపు `ఆదిపురుష్`తో రాముడిగా ఆడియెన్స్ ని అలరించబోతున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతగా కృతి సనన్ నటిస్తుంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ నెల 6న తిరుపతిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు.