సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశీ నిందితుడు విడుదల కోసం అర్జీ వేశాడు. తన అరెస్ట్ చట్టవిరుద్ధమని బాంద్రా కోర్టులో వాదించాడు.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశీ నిందితుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ జైలు నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టులో విడుదల కోసం అర్జీ దాఖలు చేశాడు. తన అరెస్ట్ చట్టవిరుద్ధమని 30 ఏళ్ల షరీఫుల్ వాదించాడు. ఇంతకు ముందు బెయిల్ కోసం పిటిషన్ వేసి శుక్రవారం (మే 9)న ఉపసంహరించుకున్నాడు. తర్వాత తన న్యాయవాది అజయ్ గవళి ద్వారా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (బాంద్రా) ముందు కొత్తగా దరఖాస్తు చేశాడు. తన అరెస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించి, విడుదల చేయాలని కోరాడు.
కొత్త పిటిషన్‌లో షరీఫుల్ తన అరెస్ట్ చట్టవిరుద్ధమని, పోలీసులు సరైన విధానం పాటించలేదని వాదించాడు. కోర్టు పోలీసుల నుంచి వివరణ కోరింది. మే 13న విచారణ జరుగుతుంది. నిందితుడు ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు.
జనవరి 16న బాంద్రాలోని సైఫ్ అపార్ట్‌మెంట్‌లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. దొంగతనం చేయాలనుకున్నాడు. విఫలమవ్వడంతో సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. సైఫ్ తీవ్రంగా గాయపడి ఐదు రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. సైఫ్ వెన్నెముకలో కత్తి ముక్క దిగి, సర్జరీ చేయాల్సి వచ్చింది. CCTV ఫుటేజ్ ఆధారంగా పోలీసులు షరీఫుల్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రెండు నెలలకు పైగా జైలులోనే ఉన్నాడు.