
ఈ మధ్య కాలంలో రిలీజ్ కు ముందే పాటలు, టీజర్, ట్రైలర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం ‘బేబీ’(Baby movie). ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ‘కలర్ ఫొటో’ వంటి నేషనల్ అవార్డ్ కొట్టిన సినిమాకి కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం.. ‘టాక్సీవాలా’ వంటి హిట్ తర్వాత ఎస్‌కేఎన్ సోలోగా నిర్మించిన సినిమా కావడం.. ప్రమోషన్ మెటీరియల్ యూత్ మెచ్చేలా కొత్తదనం నింపుకొని ఆకర్షణీయంగా ఉండటంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ఈ ‘బేబీ’ నిన్న శుక్రవారం మన ముందుకు వచ్చింది. సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కారనే చెప్పాలి. సాయి రాజేష్ దర్శకుడిగా సత్తా చాటారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లోకి వెళ్తే.. నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది అని సమాచారం. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00కోట్లుగా ఫిక్సైంది.
అలాగే ఈ సినిమా భారీగానే రిలీజైంది. బేబీ మూవీని నైజాంలో 120, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 220 థియేటర్లలో విడుదల అయ్యింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 340 థియేటర్లలో వచ్చిన ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాలను కలిపి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 వరకూ థియేటర్లలో రిలీజైంది.
ఈ సినిమా ప్రిమియర్స్ నుంచి సినిమాకు మంచి టాక్ రావటం ప్లస్ అయ్యింది. మార్నింగ్ షోలకు టాక్ మిక్స్‌డ్‌గా వచ్చినా, రివ్యూలు డివైడ్ గా వచ్చినా ఓపినింగ్స్ అదిరిపోయాయి. యూత్ భారిగా థియేటర్లకు తరలి రావటం కలిసొచ్చింది. సింగిల్ స్క్రీన్లలో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి. ‘ఆర్ఎక్స్ 100’తరహాలో ఈ చిన్న సినిమా కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. అంతేకాదు యుఎస్‌లో ప్రిమియర్స్ నుంచి ఈ సినిమా లక్ష డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ అంతా కూడా ‘బేబి’కుమ్మేస్తుందంటున్నారు. దాంతో బయ్యర్లందరూ కూడా బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పడతారనే నమ్మకంగా ఉంది. సినిమా ఫుల్ రన్లో రూ.15 కోట్ల షేర్ రేంజికి వెళ్లే అవకాసం ఉందని అంచనా వేస్తున్నారు.