
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ప్రముఖ దర్శకుడు రాజమౌళి భేటీ కానున్నారు. రాజమౌళితో పాటు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్‌ను కలవనున్నారు. ఈ నెల 25న ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో సీఎం జగన్‌తో రాజమౌళి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఉన్న కొన్ని సాంకేతిక అంశాలపై రాజమౌళి, దానయ్య.. సీఎం జగన్‌తో చర్చించే అవకాశం ఉంది.
ఇక, కొద్దిసేపటి క్రితం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడటంతో.. సీఎం జగన్ అసెంబ్లీ నుంచి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరారు. మరోవైపు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జక్కన్న, దానయ్య.. రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకుని సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం సీని పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకు ముందు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తరుల ప్రకారం ప్రకారం టికెట్ల రేట్లు కనిష్టంగా రూ. 20.. గరిష్టంగా రూ. 250గా నిర్ణయించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు తగ్గడంతో మార్చి 25న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం కోసం.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.