
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలే ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసు ఆమెని వెంటాడుతుంది. మరోవైపు సీబీఐ సైతం ఆమెని విచారించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో రియా ఇప్పుడు కీలకంగా మారింది. ఆమె ఏం చెబుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇదిలా ఉంటే సుశాంత్ అకౌంట్ నుంచి దాదాపు రూ.15కోట్లు రియా అజ్ఞాత అకౌంట్‌కి తరలించిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన దీనిపై విచారించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం రియా చక్రవర్తిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఈ సందర్భంగా ఆమె సుశాంత్ నుంచి తాను పొందిన ఆస్తి `లెటర్, వాటర్ బాటిల్` మాత్రమే అని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ అధికారులు సైతం అవాక్కయ్యారు. అదే సమయంలో పలు కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టు తెలుస్తుంది.
ఇక ఈ కేసులో భాగంగా రియాతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈడీ సమన్లు పంపించింది. రియా సోదరుడు షోయుక్ చక్రవర్తి, తండ్రి ఇందర్ జిత్ చక్రవర్తి, అలాగే సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని కూడా హాజరు కావాల్సి ఉంది. సోమవారం వారు ఈడీ ముందు హాజరు కావాలని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు వీరిని ప్రశ్నించనున్నారు. మరి వీరి నుంచి ఎలాంటి సమాచారం వస్తుందనే ఆసక్తి నెలకొంది. ఈ రోజు విచారణతో రియాని, ఆమె తండ్రిని ఈడీ విచారించడం రెండోసారి అవుతుంది. ఆమె సోదరుడిని విచారించడం మూడో సారి అవుతుంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబయి బాంద్రాలోని తన ఆపార్ట్ మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఇది ఆత్మహత్యగా భావించారు. ఆ తర్వాత హత్య జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ముంబయి పోలీసులు, బీహార్ పోలీసులు విచారిస్తున్నారు. దీన్ని సీబీఐకి అప్పగించాలని సుశాంత్ తండ్రి కేకే సింగ్ కోరిక మేరకు కేంద్రం ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. మరోవైపు బీహార్ కేసుని ముంబయికి మార్చాలని రియా సుప్రీంకోర్ట్ లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్ తీర్పుని వెలువరించాల్సి ఉంది.