
రెండు రోజులపాటు వివాదస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV)కి, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని(Perni Nani)కి మధ్య ట్విట్టర్ వార్ నడిచిన విషయం తెలిసిందే. ఇది పెద్ద దుమారం సృష్టించింది. అయితే తాజాగా Varmaకి అపాయింట్‌మెంట్ ఇచ్చారు మంత్రి Perni Nani. ఈ నెల పదిన కలిసేందుకు అపాయింట్‌మెంట్ వచ్చిందని తాజాగా వర్మ తెలిపారు. `ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి నుంచి తనకు అహ్వానం అందిందని తెలియజేయడానికి చాల ఆనందంగా ఉంది. జనవరి 10 మధ్యాహ్నం అమరావతి సెక్రెటరియేట్‌లో కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఏపీ టికెట్ల రేట్ల ఇష్యూ విషయంలో పరిష్కారానికి సంబంధించిన ఆలోచనలు పంచుకునేందుకు ఇనిషియేట్ తీసుకున్న మత్రి పేర్నినానిగారికి దన్యవాదాలు` అని ట్వీట్ చేశారు వర్మ.
ఏపీ టికెట్ల రేట్ల తగ్గింపు విషయం టాలీవుడ్‌లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతుంది. దీనిపై పలువురు తారలు స్పందించి ట్వీట్లు, కామెంట్లు చేయగా అవి వివాదంగా మారాయి. కానీ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎంట్రీతో టికెట్ల రేట్ల ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. వర్మ బ్యాక్ టూ బ్యాక్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు పెద్ద వివాదం సృష్టించాయి. వర్మ కామెంట్లతో రంగంలోకి దిగిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వర్మకి కౌంటర్ ఇస్తూ ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది.
టికెట్ల రేట్ల నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, నిత్యావసర వస్తువులను ప్రభుత్వం నిర్ణయిస్తుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వర్మ. హీరో రెమ్యూనరేషన్‌పై పేర్ని నాని చేసిన కామెంట్లకి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు వర్మ. హీరోతోనేసినిమా ఆడుతుందని, హీరో కోసమే ఆడియెన్స్ సినిమాకి వస్తారని, వాళ్లు లేకపోతే పెద్ద సినిమాలు లేవని తెలిపారు. వారి పారితోషికం కూడా సినిమా నిర్మాణంలో భాగమే అని చెప్పారు. టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల హీరో పారితోషికం తగ్గదని, సినిమా క్వాలిటీ తగ్గుతుందని, అంతిమంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు నష్టపోతారని తెలిపారు.
దీనికి పేర్ని నాని కౌంటర్ ఇవ్వడం, దానికి వర్మ సమాధానం చెప్పడం, మళ్లీ కౌంటర్ ఇవ్వడంతో రెండు రోజులపాటు వర్మ, మంత్రి పేర్నినాని మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. అంతిమంగా వీరిద్దరు కలుద్దాం. దీనిపై మరింత క్షుణ్ణంగా మాట్లాడుకుందామనుకున్నారు. పేర్ని నాని సైతం వర్మని కలవడానికి ఓకే చెప్పారు. తాజాగా ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం విశేషం. అయితే దీనిపై నెటిజన్లు షాకింగ్ పోస్ట్ లు పెడుతున్నారు. వర్మ తిరిగి వస్తాడా? వర్మ ఆరోగ్య పరిస్థితేంటో? అంటూ సెటైర్లు వేయడం గమనార్హం.