
చట్ట విరుద్ధంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డు ప్రయత్నిస్తోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కోర్టుకు వెళ్లి కేసు దాఖలు చేస్తున్నట్టు ఆయన సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో ఆదివారం రాత్రి మరొకసారి ఆయన ట్వీట్ చేస్తూ ‘‘సెన్సార్ బోర్డుతో మాకున్న అపార్థాలు తొలగిపోయాయి.
ఇక సెన్సార్ అవసరమైన చర్యలు చేపడుతుంది’’అని పేర్కొన్నారు. ఆయన కోర్టుకు వెళ్లతాను అనంటతో సెన్సార్ బోర్డ్ కు రామ్ గోపాల్ వర్మకు మధ్య రాజీ కుదిరింది అంటున్నారు. ఇదంతా మూడు గంటల వ్యవధిలో జరిగిపోయింది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు కలిసి తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ నెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఇటీవలే సెన్సార్ సర్టిఫికేట్ కోసం సినిమాని పంపింది.
అయితే తొలి దశ ఎన్నికలు పూర్తయ్యేవరకు సినిమాని పరిశీలించడం సాధ్యం కాదని సెన్సార్ బోర్డు నుంచి తనకి లేఖ అందినట్టు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. సెన్సార్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం రానిదే, సినిమా విడుదల సాధ్యం కాదు కాబట్టి విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలున్నాయి. దాంతో సెన్సార్ బోర్డు లేఖపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
‘‘ఎన్నికల కోడ్ పేరిట సినిమా సెన్సార్ స్క్రీనింగ్‌ని వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదు. ఇదంతా మరొకరి ప్రయోజనం కోసమే చేస్తున్నట్టుంది. ఒక రకంగా ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించడమే. ఏ రాజకీయ పార్టీతోనూ మా సినిమాకి సంబంధం లేదు. మా చిత్రబృందంలో ఎవ్వరూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. సినిమాని చూడకముందే ఎన్నికల నియమావళి పేరిట ధ్రువీకరణ పత్రం ఇచ్చే ప్రక్రియని ఆలస్యం చేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వివాదంపై ఆయన తన లాయిర్ తో కలిసి మీడియా ముందుకొస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు సెన్సార్ కు ఏ సమస్యాలేదు అని తేలింది కాబట్టి ఇబ్బంది ఉండనట్లే. చెప్పిన టైమ్ కు సినిమా రిలీజ్ అవుతున్నట్లే.