ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న RC15 టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. తాజా ఇంటర్వ్యూలో డేట్ ను కూడా చెప్పేశారు. అలాగే విడుదల తేదీపైనా స్పందించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Chran) నటిస్తున్న భారీ చిత్రం ‘ఆర్సీ15’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో సినిమా ప్రకటనకు సంబంధించిన పోస్టర్లు తప్పా ఇప్పటి వరకు RC15 నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమాను అనౌన్స్ చేసి రెండేండ్లు గడిచినా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించారు. త్వరలో ‘ఆర్సీ15’ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను విడుదల చేస్తామని అన్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దిల్ రాజకు ‘ఆర్సీ15’పై ప్రశ్నలు ఎదురయ్యాయి. టైటిల్, ఫస్ట్ లుక్, సినిమా విడుదలపూ ఎప్పుడు అప్డేట్ ఇస్తారని ప్రశ్నించారు. ఇందుకు దిల్ రాజు స్పందిస్తూ.. రామ్ చరణ్ బర్త్ డే రోజున (మార్చి 27న) ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. టైటిల్ కోసం శంకర్ ఓ కొత్త లోగోను డిజైన్ చేపిస్తున్నట్టు తెలిపారు. ఇక సినిమా విడుదల విషయానికొస్తే.. వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి విడుదల కావొచ్చు అన్నారు. అదీ డైరెక్టర్ శంకర్ గారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఇన్ని నెలలకు ఆర్సీ15పై అప్డేట్ అందించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చరణ్ బర్త్ డే కోసం ఎదురుచూస్తున్నారు.
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘ఆర్సీ15’లో రామ్ చరణ్ ద్విపాత్రినభియం చేయబోతున్నారని తెలుస్తోంది. ఒకటి విద్యార్థిగా, మరొకటి ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్. మరోవైపు ముఖ్యమంత్రిగానూ కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన గెటప్ లీకైన విషయం తెలిసిందే. ఇక చిత్రానికి ‘విశ్వంభర’,‘సర్కారోడు’,‘అధికారి’ తాజాగా ‘సీఈవో’ (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) వంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో దేన్ని అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి. చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలోని ఆయా ప్రొగ్రామ్స్ కు హాజరవుతూ బిజీగా ఉన్నారు. మార్చి 12న ‘ఆస్కార్స్2023’ వేడుకగా ఘనంగా జరగనుంది. మరోవైపు చరణ్ తదుపరి చిత్రం ‘ఆర్సీ16’ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్ ఖాన్ చిత్రాల్లోనూ కనిపించబోతున్నారు మెగా పవర్ స్టార్. త్వరలో హాలీవుడ్ సినిమాను ప్రకటించనుండటం విశేషం.