
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల వయస్సులో వృద్థాప్య సమస్యల తో బాధపడుతూ రాజగోపాల్. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మృతి చెందారు. మరో కుమారుడు రఘు టాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన పలు సినిమాల్లో నటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోరాజగోపాల్ రాజు జన్మించారు. రాజు ఫార్మాసిస్ట్‌గా పనిచేయడంతో ఉద్యోగరీత్యా ఒక చోట ఉండటం కుదరక, వివిధ ప్రాంతాల్లో ఉండేవారు. నార్త్ ఇండియాలో రాజగోపాల్ రాజు ఎక్కువగా జీవితం గడిపారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు వరకు కూడా రవితేజ తండ్రితో కలిసి జైపుర్, దిల్లీ, ముంబయిల్లో ఉన్నారు. అందుకే రవితేజ అక్కడ ఎక్కువగా హిందీ సినిమాలు చూసి అమితాబ్ కు వీరాభిమానిగా మారారు. అంతే కాదు మాస్ మహారాజ్ కు రకరకాల యాసల్లో పట్టు వచ్చింది కూడా ఇలా ఉండటం వల్లే అని తెలుస్తోంది.
ఇక రాజగోపాల్ రాజు మరణవార్త తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రవితేజకు కొంత మంది స్టార్స్ ఫోన్ చేసి సంతాపం ప్రకటించగా.. మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. రవితేజ తండ్రి మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ పోస్ట్ పెట్టారు.