
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు నెలకొంటున్నాయి. టాలీవుడ్ సీనియర్ నటులు వరుసగా ఒక్కొక్కరు కన్నుమూస్తుండటంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెబల్ స్టార్ క్రిష్ణం రావు, సూపర్ స్టార్ క్రిష్ణ, మొన్న నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తాజాగా సినీయర్ నటుడు చలపతిరావు (Chalapathi Rao) గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో చిత్ర సీమలో విషాధ ఛాయలు నెలకొన్నాయి.
అయితే, చలపతి రావు అంత్యక్రియలు కాస్తా ఆలస్యంగా జరగనున్నాయి. దీనిపై తాజాగా కొడుకు రవిబాబు (Ravi Babu) సమాచారం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి ఎనిమిది గంటలకు నాన్న గారు చనిపోయారు. మధ్యాహ్నం మహా ప్రస్థానంకు ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్తాం. అంత్యక్రియలు మాత్రం బుధవారం నిర్వహిస్తాం. అమెరికా నుంచి అక్కలు ఇద్దరూ రావాల్సి ఉంది. మంగళవారం రాత్రి కళ్లా ఇండియాకు చేరుకోనున్నారు. అందుకే బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం.’అని పేర్కొన్నారు.
ఆయన మరణ వార్తతో నటీనటులు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలయ్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతాపాలు ప్రకటించారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1966లో తెలుగు తెరకు పరిచయం చలపతిరావు 600కు పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ, విలన్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించి ప్రసిద్ధి చెందారు. 90లొ నిర్మాతగానూ పలు చిత్రాలను నిర్మించారు.