
విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ని ఏలుతున్న రారాజు. సచిన్ తర్వాత రికార్డుల వారసత్వాన్ని కోహ్లీ అందిపుచ్చుకున్నాడు. గత దశాబ్దం కాలంగా కోహ్లీ బ్రాండ్ వాల్యూ, సంపాదన ఊహకి అందని విధంగా ఉంది. సినీ తారలు, క్రికెటర్ల మధ్య సంపాదన విషయంలో ఎప్పుడూ పోటీ ఉంటుంది. సెలెబ్రిటీలు చేసే కమర్షియల్ యాడ్స్, ఎండార్స్మెంట్స్ బట్టి వారి సంపాదన విషయంలో ఒక అంచనాకి రావచ్చు.
బ్రాండ్ అంబాసిడర్లుగా సెలెబ్రిటీలు ఆర్జించే మొత్తాన్ని బట్టే వారి బ్రాండ్ వాల్యూ ఉంటుంది. 2021 వరకు కోహ్లీ బ్రాండ్ వాల్యూ విషయంలో అగ్ర స్థానంలో కొనసాగుతూ వచ్చాడు. అంతకు ముందు ఐదేళ్ల పాటు కోహ్లీ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అయితే క్రోల్ అనే సంస్థ 2022 సంవత్సరానికి బ్రాండ్ వాల్యూ విషయంలో ఒక నివేదిక ఇచ్చింది. దీనిని బట్టి గత ఏడాది కోహ్లీ స్థానానికి ఎసరు పెట్టిన రణ్వీర్ సింగ్ టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు.
ఈ నివేదిక ప్రకారం రణ్వీర్ సింగ్ 181.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో కోహ్లీని అధికమించి అగ్ర స్థానాన్ని కైవశం చేసుకున్నాడు. అంటే 1400 కోట్లకి పైనే రణ్వీర్ సింగ్ బ్రాండ్ వాల్యూ ఉందన్నమాట. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత అతడి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ వచ్చింది. గత ఏడాది కోహ్లీ బ్రాండ్ వాల్యూ 176 మిలియన్ డాలర్లుగా నమోదైంది. దీనితో రణ్వీర్ సింగ్ కి టాప్ పొజిషన్ సాధ్యం అయింది.
2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 237 మిలియన్ డాలర్లుగా పీక్ లో ఉండేది. కానీ ఈ రెండేళ్లలో కోహ్లీ బ్రాండ్ వాల్యూ బాగా పడిపోయింది. అయినప్పటికీ కోహ్లీ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. వీళ్లిద్దరి తర్వాత మూడవ స్థానంలో 156 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కొనసాగుతున్నారు. నాలుగవ స్థానంలో అలియా భట్ 102 మిలియన్ డాలర్లతో ఉంది. దీపికా పదుకొనెని అలియా అధికమించడం విశేషం. దీపికా 82 మిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో ఉంది.
6వ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని, ఆ తర్వాతి స్థానాల్లో అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నారు. ఇక సౌత్ నుంచి ఒకే ఒక్కడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మాత్రమే టాప్ 25 లో చోటు దక్కింది. పుష్ప చిత్రంతో బన్నీ బన్నీ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా తారా స్థాయికి చేరింది. ఇక అల్లు అర్జున్ జోడి రష్మిక మందన కూడా టాప్ 25 లో చోటు దక్కించుకుంది. అలాగే టాప్ 25లో ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, తెలుగు తేజం పీవీ సింధు ఉన్నారు.