రంగస్థలం ఫుల్ స్టోరీ లీక్.. ఇదే..

First Published Jan 22, 2018, 4:29 PM IST
Highlights
  • రామ్ చరణ్ హీరోగా రంగస్థలం
  • సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం
  • రామ్ చరణ్ సరసన సమంత హిరోయన్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం రంగస్థలం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమారు రూ.100 కోట్ల వ్యయంతో రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలై చాలా రోజులు గడుస్తున్నా.. వేసవి బరిలో ఈ చిత్రాన్ని నిలిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 

రంగస్థలం సినిమాకు సంబంధించిన కథ ఇదే అంటూ తాజాగా ఓ కథ వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం.. చిట్టిబాబు (రాంచరణ్) తండ్రి (రాజీవ్ కనకాల) ఓ వర్గానికి నాయకుడు. చిట్టిబాబు చిన్నతనంలోనే వర్గ విభేదాల కారణంగా తండ్రిని కోల్పోతాడు. తన తండ్రిని మట్టుబెట్టిన వారెవరూ అని తెలుసుకొంటూ చిట్టిబాబు వారిని అంతం చేయటమే సినిమా కథ.

 

తన తండ్రిని ఎవరు చంపారనే విషయాన్ని తెలుసుకోవడంపై కథ నడుస్తుందట. పగ, ప్రతీకారం అంశాల మధ్య సమంత, రాంచరణ్ మధ్య ఓ ప్రేమకథ కూడా ఆసక్తికరంగా సాగుతుందట. సినిమా కథ సాధారణంగా అనిపించినా సుకుమార్ స్టయిల్‌లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. సమంత ఈ చిత్రంలో లక్ష్మీ అనే పాత్రను పోషిస్తున్నారని తెలిసింది. గ్రామీణ ప్రాంత అమ్మాయిగా సమంత విభిన్నమైన పాత్రను పోషిస్తున్నదట. ఈ చిత్రంలో రాంచరణ్, సమంత కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుంది అనేది తెలిసింది.

 

రంగస్థలం కథ 60వ దశకంలో ప్రారంభమై 80వ దశకం వరకు సాగుతుందట. అప్పటి వాతావరణం, పరిస్థితులన్నింటిపై పరిశోధన చేసి దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే విధంగా తెరకెక్కిస్తున్నారనేది తాజా సమాచారం.

 

దాదాపు 20 ఏళ్ల కాల పరిమితిలో జరిగే సంఘటనలు, వాటికి సంబంధించిన కథనాలను ఆసక్తికరంగా ఉంటాయనేది సినీ వర్గాల కథనం. ప్రేక్షకులకు మళ్లీ పాత రోజులు గుర్తు తేవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి.

 

రంగస్థలంలో అనసూయ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. మర్డర్ కేసుకు సంబంధించిన దర్యాప్తును చేపట్టే అధికారిగా అనసూయ కనిపిస్తుందట. ఈ టాప్ యాంకర్ విభిన్నమైన గెటప్‌తో తెర మీద సందడి చేయనున్నారనేది తాజా సమాచారం. ఆది పినిశెట్టి జిల్లాలో ఉన్నతాధికారిగా కనిపిస్తారట.

 

గ్రామంలో ఊరి పెద్దలుగా జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారట. ఈ మోతుబరి రైతులు చేసే కుట్రల కారణంగానే రాంచరణ్ కుటుంబం బలైపోతుందట. ఇలాంటి కథతో రంగస్థలం ముస్తాబవుతున్నది. భారీ తారాగణం, బడ్జెట్‌తో రూపొందిన రంగస్థలం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

click me!