
కంటెంట్ లేనప్పుడు కనీసం కాంట్రవర్సీతో అయినా సినిమాకు ప్రచారం తేవాలి. తాను తీసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సత్తా లేదని గ్రహించిన దర్శకుడు శరత్ మండవ(Sarat Mandava) కాంట్రవర్సీతో హైప్ తేవాలని చూశాడు. ప్రీ రిలీజ్ వేడుకలో ట్విట్టర్ రివ్యూస్ పై అనుచిత కామెంట్స్ చేశాడు. పిట్టలు రెట్టలు వేస్తాయి, ట్విట్టర్ రివ్యూలు, కామెంట్స్ ఆధారంగా సినిమాకు వెళ్లే అలవాటు మానేయండి. రామారావు ఆన్ డ్యూటీ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుంది అంటూ.. గొప్పలు పలికాడు. పలు ఇంటర్వ్యూలలో సైతం ఈ చిత్రాన్ని న్యూ ఏజ్ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ డ్రామాగా అభివర్ణించాడు.
దర్శకుడు శరత్ కాన్ఫిడెంట్, యాటిట్యూడ్ చూసి రవితేజ ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యారు. కాలర్ ఎగరేసుకుని సినిమాకు వెళ్లారు. తీరా థియేటర్లో సినిమా చూశాక నీరుగారిపోయారు. కొందరైతే మధ్యలోనే థియేటర్ నుండి బయటికి పరుగు లంకించుకున్నారు. రవితేజ నటించిన కొన్ని అట్టర్ ప్లాప్ చిత్రాల్లో కూడా మేము ఆయన ఎనర్జీని ఎంజాయ్ చేశాము... రామారావు ఆన్ డ్యూటీ(Ramarao On Duty)లో ఎంజాయ్ చేసిన ఒక్క మూమెంట్ లేదంటున్నారు. ఒక కథ లేదు, స్క్రీన్ ప్లే లేదు. సాంగ్స్ బాగోలేదు... అసలు సినిమా ఎందుకు తీశాడో కూడా తెలియదు. దీనికి మళ్ళీ సీక్వెలా.. దయచేసి ఆ పని చెయ్యొద్దు మహా ప్రభో అంటున్నారు.
ఇక విడుదలకు ముందు దర్శకుడు శరత్ చేసిన కామెంట్స్ గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్... నువ్వు చూపించిన యాటిట్యూడ్ కి తీసిన సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అని ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరైతే రాయలేని బూతులతో శరత్ పై దాడికి దిగారు. నీకు అసలు సినిమా తీయడం వచ్చా... సినిమా సీరియస్ గా వెళుతుంటే ఆ లవ్ ట్రాక్స్ ఏంటీ? ఫస్ట్ హాఫ్ లోనే సందర్భం లేకుండా ఐటెం సాంగ్ ఏంటి? అంటూ ఏకిపారేస్తున్నారు. ఫ్యాన్స్ దాడికి తట్టుకోలేక శరత్ అనేక మంది అకౌంట్స్ బ్లాక్ లో పెడుతున్నారు.
అదే సమయంలో రవితేజ(Raviteja)కు ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి స్క్రిప్ట్ ఎలా ఓకే చేశావని ప్రశ్నిస్తున్నారు. మాకు ఏడాదికి మూడు సినిమాలు వద్దు మంచి సినిమా ఒకటి చాలు. ఇలాంటి దర్శకులకు అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్నటి నుండి రామారావు ఆన్ డ్యూటీ విషయంలో ఇదే తరహా ఆవేదన ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక డిజాస్టర్ టాక్ నేపథ్యంలో రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే ఏపీ/తెలంగాణలలో రూ. 2.8 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం.