
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్న ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉంటుందని చెప్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ పాత్రలో నటించనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన మరో వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...
#RC16 సినిమా మల్ల మార్తాండ, కళియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులస్‌గా ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తిని చాటి చెప్పిన సిక్కోలు ముద్దు బిడ్డ కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోందని చెప్తున్నారు. గతంలోనూ సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, హీరోలు, రచయితలు కోడి రామ్మూర్తినాయుడు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి ఈ చిత్రం తీద్దామని ప్రయత్నం చేసారు కానీ ముందుకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ తో ఈ సినిమా తీసే అవకాసం ఉందని వినికిడి.
కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు బ్రహ్మచారి. శాకాహారి అయిన ఆయన ఆంజనేయ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజ చెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి పిలిచి మంత్రోపదేశం చేశారట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందని స్థానికులు చెబుతారు. వ్యాయామ, దేహదారుఢ్యం, యోగా విద్యలను అలవోకగా చేసేవారు. తర్వాతి కాలంలో ఆయన విజయనగరంలో ఓ సర్కస్ కంపెనీ మొదలుపెట్టారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.
రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు.రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తినాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు.
బుచ్చిబాబు మాట్లాడుతూ...‘నేను రామ్ చరణ్‌తో తీయనున్న మూవీ (#RC16) రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నేను కథ రాసుకుంటున్న సమయంలో ఆయన సంగీతం అందిస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆయన్ని సంప్రదించి కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. ఆయనకు చాలా నచ్చిందీ కథ. ‘ఇప్పటి వరకూ చాలా స్టోరీలు విన్నా కానీ, ఇలాంటిది వినలేదు. కచ్చితంగా మ్యూజిక్ చేస్తాను’ అన్నారు. దీని షూటింగ్ జనవరిలో మొదలు పెట్టనున్నాం. అందరూ ఇది స్పోర్ట్స్ డ్రామా అనుకుంటున్నారు. కానీ వాళ్లందరి అంచనాలకు మించి ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను’’ అని బుచ్చిబాబు తెలిపారు.