
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్.. మరో పక్క కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనితో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా శంకర్ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.
తాజాగా రాంచరణ్ డైరెక్టర్ శంకర్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ శంకర్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై 30 ఏళ్ళు పూర్తయింది. శంకర్ దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రం జెంటిల్ మాన్ జూలై 30న 1993లో విడుదలైంది. అప్పటి నుంచి శంకర్ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. భారత చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఆశ్చర్యపోయేలా ఆయన ప్రయోగాత్మక చిత్రాలు, భారీ చిత్రాలు తెరకెక్కించి మెప్పించారు.
ఈ సందర్భంగా శంకర్ కి శుభాకాంక్షలు చెబుతూ రాంచరణ్ ట్వీట్ చేశారు. 'ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు నిజమైన గేమ్ ఛేంజర్. మీ కెరీర్ అద్భుతమైన 30 ఏళ్ళు పూర్తయినందుకు శుభాకాంక్షలు శంకర్ సర్. మీ నుంచి మరిన్ని ఆదర్శవంతమైన పని కోసం ఎదురుచూస్తున్నాం' అంటూ చరణ్ పేర్కొన్నాడు.
జెంటిల్ మాన్ తర్వాత శంకర్ వెనుదిరిగి చూసుకోలేదు. భారతీయుడు, ఒకేఒక్కడు, జీన్స్, అపరిచితుడు, శివాజీ, రోబో లాంటి ఎన్నో అద్భుత చిత్రాలని శంకర్ అందించారు. జెంటిల్ మాన్, భారతీయుడు, అపరిచితుడు లాంటి చిత్రాలకు శంకర్ ఉత్తమ దర్శకుడిగా తమిళనాడు స్టేట్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ సీక్వెల్ ఇండియన్ 2.. రాంచరణ్ గేమ్ ఛేంజర్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.