
`ఆర్‌ఆర్‌ఆర్`(RRR) వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్‌చరణ్(Ram Charan) నుంచి రాబోతున్న చిత్రం `ఆచార్య`(Acharya). మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరుకి జోడీగా కాజల్, చరణ్‌కి పూజా హెగ్డే నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29(శుక్రవారం) విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మీడియాలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `ఆచార్య` పాన్ ఇండియా ప్లాన్‌ని వెల్లడించారు.
రామ్‌చరణ్‌కి `ఆర్‌ఆర్‌ఆర్` హిట్‌తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. దీంతో ఆయన నుంచి వస్తోన్న `ఆచార్య` చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారా? అనే డౌట్లు వెల్లడయ్యాయి. కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం నుంచి వార్తలొచ్చాయి. అయితే ఎందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం లేదనేదానికి రామ్‌చరణ్ క్లారిటీ ఇచ్చారు.
పాన్ ఇండియా(Acharya Pan India Release) ఆలోచన ఉందని చెప్పారు. కానీ సినిమా రిలీజ్‌కి అనుకున్నంత టైమ్ లేదని, `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత వెంటనే రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో ప్రమోషన్, డబ్బింగ్ వంటి కార్యక్రమాలకు సమయం సరిపోవడం లేదన్నారు. పాన్ ఇండియా రిలీజ్ అంటూ చాలా పనులుంటాయని, ముందుగా నాన్నగారికిగానీ, కొరటాలకి గానీ పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలనే ఆలోచన లేదని చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్` రిలీజ్ తర్వాతే ఆ ఆలోచన వచ్చినట్టు చెప్పారు. ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పించడం, సరిగ్గా ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా టైమ్ పడుతుంది. ఇప్పుడు అంత టైమ్ లేకపోవడంతో ఆ ఆలోచన వాయిదా వేసుకున్నామన్నారు.
అయితే తెలుగులో రిలీజ్ అయ్యాక తర్వాత హిందీ లాంటి ఇతర భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. చరణ్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్ర రిజల్ట్ ని బట్టి బాలీవుడ్‌లో విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పైగా ఇది యాక్షన్ మూవీ. బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. `ఆర్‌ఆర్‌ఆర్`, `కేజీఎఫ్ 2` భారీ విజయాలు సాధించాయి. బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాయి. ఆ కోవలో `ఆచార్య` ఇక్కడ హిట్ అయితే హిందీలోనూ మంచి ఆదరణ దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక `ఆచార్య` కథలోకి తాను ఎలా వచ్చాననే దానిపై రామ్‌చరణ్ స్పందిస్తూ, ఆ విషయం తనకే తెలియదన్నారు. `ఆచార్య`లో నాన్నది, నాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు. నేను `ధర్మస్థలి`లోని గురుకులంలోని యువకునిగా కనిపిస్తాను. నాన్నగారు ఒక ఫైటర్‌లా కనిపిస్తారు. మా ఇద్దరి పాత్రలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అయితే ధర్మం కోసం ఇద్దరూ ఎలా కలుస్తారు? అధర్మంపై ఎలా పోరాటం చేశారు? అనేది కొరటాలగారు చాలా బాగా చూపించారు. రాజమౌళిగారు `బొమ్మరిల్లు` ఫాదర్‌లాంటివారు. ఆయన సినిమా అంగీకరించామంటే అది పూర్తయ్యే వరకూ ఆర్టిస్ట్‌ల చేయి వదలరు. కానీ సిద్ధ పాత్ర గురించి కొరటాలగారు రాజమౌళిగారికి చెప్పారు. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను రాజమౌళిగారు గుర్తించి, నేను చేస్తేనే బాగుంటుందన్నారు. పైగా మా నాన్నమీద గౌరవంతో, అమ్మ(సురేఖ) డ్రీమ్ ప్రాజెక్ట్ అని ‘ఆచార్య’ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారని చెప్పారు చరణ్. తన పాత్ర సెకండాఫ్‌లో వస్తుందని, కేవలం 40 నిమిషాల నిడివే ఉంటుందని, క్లైమాక్స్ లో మాత్రం ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్‌లా ఉంటుందన్నారు.