కలాం కోరిక తీరకుండానే వెళ్ళిపోయారుః వివేక్‌ కి రజనీ, కమల్‌, సూర్య, విక్రమ్‌, కీర్తిసురేష్‌ సంతాపం..

By Aithagoni RajuFirst Published Apr 17, 2021, 3:20 PM IST
Highlights

 ప్రముఖ హాస్య నటుడు గుండెపోటుతో శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, సూర్య, విక్రమ్‌, నటి జ్యోతిక, హీరోయిన్‌ కీర్తిసురేష్‌, తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వంటి వారు సంతాపం తెలియజేశారు.

`హాస్యనటుడు వివేక్‌ గురువు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. ఆయన కోరిక మేరకు గ్లోబల్‌ వార్మింగ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతోపాటు చెట్ల పెంపకాన్ని తన మిషన్‌గా పెట్టుకున్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే వివేక్‌ వెళ్లిపోయారు` అని సినీ ప్రముఖులు వివేక్‌కి సంతాపం తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు గుండెపోటుతో శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, సూర్య, విక్రమ్‌, నటి జ్యోతిక, హీరోయిన్‌ కీర్తిసురేష్‌, తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వంటి వారు సంతాపం తెలియజేశారు. సోషల్‌ మీడియా ద్వారా ఆయన్ని గుర్తి చేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు. 

సూర్య, జ్యోతిక, విక్రమ్‌, కీర్తిసురేష్‌ వంటి ప్రముఖులు వివేక్‌ మృతదేహానికి నివాళ్లు అర్పించారు. రజనీకాంత్‌ తన ట్విట్టర్‌ ద్వారా వివేక్‌కి సంతాపం తెలియజేస్తూ `శివాజీ` సినిమా నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.  విశాల్‌ ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు. తమిళంతోపాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించి హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ 500కి పైగా చిత్రాల్లో నటించి తన మార్క్‌ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. నటనపైన మక్కువ మాత్రమే కాదు, వివేక్‌ ప్రకృతి ప్రేమికుడు కూడా. పర్యావరణ పరిరక్షణకోసం నిరంతరం పాటుపడేవాడు. తన నటనా కౌశలంతో పద్మ‍శ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వివేక్‌ తనకు గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం అని ఎపుడూ చెబుతుంటారు.  

కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్‌గా పెట్టుకున్నారు. అందులో భాగంగా తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందు కోసం 2011లో భారీ చెట్ల పెంపకం కోసం  `గ్రీన్ కలాం` ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటి వరకు 33.23 లక్షల మొక్కలు నాటారు. ఈ విషయాన్నే ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కోరిక తీరకుండానే వివేక్‌ వెళ్లిపోయారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఈ క్రమంలో ఆయన  ట్విటర్‌లో పోస్ట్‌  చేసిన వీడియోలను రీపోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఆర్‌ఐపీ వివేక్‌ సార్‌ హ్యాష్‌ట్యాగ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇదే విషయాన్ని తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ తెలిపారు. ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 33 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం విచారకరమన్నారు. వివేక్ లక్ష్యం అర్ధంతరంగా ఆగిపోకుండా మిగతా 78 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించి, పూర్తి చేస్తామని జోగినపల్లి ప్రకటించారు. ప్రకృతి ప్రేమికుడు వివేక్ లక్ష్య సాధనే ఆయనకు అసలైన నివాళి అని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

click me!