RRR-Radheshyam Postpone: సంక్రాంతికి పోటెత్తిన చిన్న చిత్రాలు.. `బంగార్రాజు`తోపాటు రాజ`శేఖర్‌`..

By Aithagoni Raju  |  First Published Jan 2, 2022, 8:53 PM IST

సినిమాలకు అతిపెద్ద సీజన్‌ అయిన సంక్రాంతి నుంచి భారీ సినిమాలు తప్పుకోవడంతో చిన్న చిత్రాలను, మీడియం బడ్జెట్‌ చిత్రాలకు అసలైన పండగ వచ్చిందని చెప్పొచ్చు.  కొత్తగా రాజశేఖర్‌ చిత్రం కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతుందని తెలుస్తుంది. 


దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  వైరస్‌ ప్రభావం కారణంగా ఒక్కో స్టేట్‌లో  థియేటర్లు మూత పడుతున్నాయి. చాలా వరకు సగం ఆక్యుపెన్సీతో థియేటర్లని నడిపిస్తున్నారు. దీంతో పాన్‌ ఇండియా చిత్రాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఢిల్లీలో థియేటర్లన్నీ క్లోజ్‌ కావడం, మహారాష్ట్ర, కేరళా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సగం ఆక్యుపెన్సీతోనే థియేటర్లని రన్‌ చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో భారీ పాన్‌ ఇండియా సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా పడింది. ఇదే దారిలో ప్రభాస్‌ నటించిన `రాధేశ్యామ్‌` కూడా పోస్ట్ పోన్‌ కాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సినిమాలకు అతిపెద్ద సీజన్‌ అయిన సంక్రాంతి నుంచి భారీ సినిమాలు తప్పుకోవడంతో చిన్న చిత్రాలను, మీడియం బడ్జెట్‌ చిత్రాలకు అసలైన పండగ వచ్చిందని చెప్పొచ్చు. దీంతో పొంగల్‌ లక్ష్యంగా ఇప్పుడు భారీగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల ఏడు నుంచి 15 వరకు సినిమాల జాతర ఉండబోతుందంటే అతిశయోక్తి కాదు.  `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` వాయిదా పరిణామాలతో మీడియం రేంజ్‌ చిత్రాలను నుంచి, చిన్న చిత్రాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా కొత్తగా రాజశేఖర్‌ చిత్రం కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతుందని తెలుస్తుంది. 

Latest Videos

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సంక్రాంతికి ఈ చిత్రం రాబోతుందనే వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజశేఖర్ సినిమా బరిలోకి దిగబోతుందనే వార్తతో సంక్రాంతి రేసు మరింత రంజుగా మారబోతుందని చెప్పొచ్చు. 

ఇక సంక్రాంతినే టార్గెట్‌ చేసుకుని వస్తున్నాడు కింగ్‌ నాగార్జున. ఆయన, నాగచైతన్య కలిసి నటిస్తున్న `బంగార్రాజు` సంక్రాంతికి రాబోతుంది. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా, రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. ఈసినిమా విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. దీంతోపాటు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతూ నటించిన `హీరో` చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతుంది. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దీనికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. 

వీటితోపాటు మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ నటించిన `సూపర్‌ మచ్చి` సినిమాని జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. అలాగే ఆది సాయికుమార్‌ నటించిన `ఆదితి దేవోభవ` చిత్రం జనవరి 7న `ఆర్ఆర్‌ఆర్‌` డేట్‌ని టార్గెట్‌ చేసుకుని రిలీజ్‌ అవుతుంది. నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి వస్తున్న ఆశిష్‌ హీరోగా నటించిన `రౌడీబాయ్స్` సంక్రాంతికే రాబోతుంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌ కావడం విశేషం. ఎంఎస్‌రాజు దర్శకత్వంలో ఆయన తనయుడు సుమంత్‌ అశ్విన్‌ నటించిన `7డేస్స్ 6నైట్స్` చిత్రం సంక్రాంతి రిలీజ్‌ కాబోతుంది. అలాగే సిద్దు జొన్నలగడ్డ నటించిన `డీజేటిల్లు` సినిమా జనవరి 14న విడుదల కాబోతుంది. 

వీటితోపాటు మరికొన్ని చిన్న సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ ఒకటి రెండు రోజుల్లో ఆయా ప్రకటనలు రాబోతున్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం రాజశేఖర్‌ నటించిన `శేఖర్‌`, నాగ్‌ నటించిన `బంగార్రాజు` చిత్రాల మధ్య మంచి పోటీ ఉండబోతుందని చెప్పొచ్చు. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతి ఆడియెన్స్ కి అసలైన సినిమాల ఫెస్టివల్‌ తీసుకొస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

also read: Ram Charan Bromance with Rana: అల్లూరిని నలిపేస్తున్న భళ్లాలదేవ.. పిక్‌ వైరల్‌

click me!