
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) టైటిల్ తో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టించింది. ఇప్పుడు ఓటిటిలోనూ హంగామా చేస్తోంది. అది ప్రక్కన పెడితే త్వరలో అన్ కట్ వెర్షన్ యుఎస్ లో రిలీజ్ అవుతోంది.
ఈ నేపధ్యంలో ఈ స్దాయికి కారణమైన డైరక్టర్ రాజమౌళి గురించి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యుఎస్ రివ్యూవర్స్, అక్కడ సినీ అభిమానులు రాజమౌళి గురించి ట్వీట్స్ చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి టేకింగ్, తారక్, చెర్రీల అద్భుతమైన నటన, సంగీతం, ఎడిటింగ్, ఫైట్స్ అన్నీ కూడా ఆర్ ఆర్ ఆర్ కు బాగా సెట్ అయ్యాయంటూ ట్వీట్ చేస్తున్నారు.
ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా అమెరికాలో మళ్ళీ రిలీజవ్వబోతుందనే విషయం మన వాళ్ళకు చాలా ఆనందం కలిగిస్తోంది. ఈ మేరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ అధికారిక ట్విట్టర్ ఖాతా ట్వీట్ చేసింది. జూన్ 1వ తేదీన ఆర్ ఆర్ ఆర్ అన్ కట్ వెర్షన్ ను సుమారు 100థియేటర్లలో ప్రదర్శించనున్నారట. స్పెషల్ స్క్రీనింగ్ పేరుతో ఈ సినిమాను జూన్ 1వ తారీఖున ఒక్కరోజు మాత్రమే ప్రదర్శించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ముందు కట్ చేసిన కొన్ని సీన్లను జోడించి ఆర్ ఆర్ ఆర్ సినిమా షోలు వేయనున్నారు. ఈ అన్ కట్ వెర్షన్ కు సంబంధించి టికెట్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇక బాహుబలి తర్వాత దర్శకధీరుడు దర్శకత్వంలో రూపొందిన మరో పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి విజయభేరి మోగించింది. టాలీవుడ్ యంగ్ హీరోలు జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ లు లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రంలో ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియశరణ్ కీలకపాత్రలు పోషించారు. ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.