Sirivennela: ఎడమ భుజం కోల్పోయాః కె.విశ్వనాథ్‌.. తనకు దిశా నిర్ధేశం చేశారంటూ రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు

By Aithagoni RajuFirst Published Nov 30, 2021, 9:17 PM IST
Highlights

 సిరివెన్నెల మరణంపై కళాతపస్వి కె.విశ్వనాథ్‌, దర్శకుడు రాజమౌళి తీవ్ర సంతాపం తెలిపారు. భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎడమ భుజం కోల్పోయా అంటూ కె. విశ్వనాథ్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు గుండెని పిండేస్తుంది. మరోవైపు తనకు దిశా నిర్దేశం చేశారంటూ దర్శక ధీరుడు రాజమౌళి చెప్పడం వైరల్‌గా మారింది. 

ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Seetharama Sastry ) మరణం టాలీవుడ్‌ని దిగ్ర్భాంతికి గురి చేస్తుంది. శోకసంద్రంలో ముంచెత్తింది. గుండెపగిలే వార్తతో సంగీత ప్రియులు, పాటల లవర్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. పాట ఆగిపోయిందంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. తాజాగా సిరివెన్నెల మరణంపై కళాతపస్వి కె.విశ్వనాథ్‌, దర్శకుడు రాజమౌళి తీవ్ర సంతాపం తెలిపారు. భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎడమ భుజం కోల్పోయా అంటూ కె. విశ్వనాథ్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు గుండెని పిండేస్తుంది. మరోవైపు తనకు దిశా నిర్దేశం చేశారంటూ దర్శక ధీరుడు రాజమౌళి చెప్పడం వైరల్‌గా మారింది. 

Sirivennela Seetharama Sastry ఇక లేరనే వార్తతో కళాతపస్వి స్పందించారు. మాటలు రావడం లేదంటూ, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదంటూ ఎమోషనల్‌ అయ్యారు. సిరివెన్నెలని తన తమ్ముడిగా భావిస్తానని తెలిపారు విశ్వనాథ్‌. తాను రూపొందించిన `సిరివెన్నెల` చిత్రంతో సీతారామశాస్త్రిని సిరివెన్నెలగా మార్చిన దర్శకుడు విశ్వనాథ్‌ కావడం విశేషం. ఆయన తాజాగా స్పందిస్తూ, `ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాల సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయినట్లు అనిపించింది. సిరివెన్నెల మృతితో నా ఎడమ భుజం కోల్పోయిన భావన కలుగుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.. మాట్లాడలేకుండా ఉన్నాను. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను` అంటూ విశ్వనాథ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

ఇక దర్శక ధీరుడు రాజమౌళి ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ట్విట్టర్‌ ద్వారా సిరివెన్నెలతో జర్నీని తెలియజేశారు. `1996లో మేము `అర్దాంగి` అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్ఉన తట్టి ముందుకు నడిపించినవి `ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఎప్పుడూ వదులు కోవద్దురా ఓరిమి` అన్న సీతారామశాస్త్రి గారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. 

అప్పటికీ నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్‌ 31వ తారీకు రాత్రి పది గంటలకి ఆయన ఇంటికి వెళ్లాను. `ఏం కావాలి నందీ` అని అడిగాడు. ఒక కొత్త నోట్‌బుక్‌ ఆయన చేతుల్లో పెట్టి మీ చేతుల్తో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి, ఆయన సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్నగారికి గిఫ్ట్ గా ఇచ్చాను. నాన్న గారి కళ్లల్లో ఆనందం. మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను. 

`సింహాద్రి`లో `అమ్మాయినా.. నాన్నయినా.. లేకుంటే ఎవరైనా` పాట, `మర్యాద రామన్న`లో `పరుగులు తియ్‌` పాట, ఆయనకి చాలా ఇష్టం. అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవడం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్లీ ఆయనే `ఐ లైక్‌ దిస్‌ ఛాలెంజ్‌` అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్‌ నెమరేసుకుంటూ అర్థాన్ని మళ్లీ విపులీకరించి చెప్తూ ఆయన స్టైల్‌లో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటూ వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో దోస్తా మ్యూజిక్‌ వీడియోకి లిరిక్‌ పేపర్‌లో ఆయన సంతకం చేసే షాట్‌ తీద్దామని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. ఇది చాలా గొప్ప మెమొరి. నా జీవన గమనానికి దిశా నిర్ధేశం చేసిన సీతారామశాస్తి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్టూ.. ` అని రాజమౌళి ఓ ఎమోషనల్‌ పోస్ట్ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది.

pic.twitter.com/CmBx0ZvXj6

— rajamouli ss (@ssrajamouli)

మరో దర్శకుడు వి.వి.వినాయక్‌ స్పందిస్తూ, `సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్ప వరం. ఆయన లేకపోవడం ఏమిటి? అనిపిస్తోంది. ఎస్పీ బాలుగారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా... ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారు కూడా అంతే! ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతారు. నేను దర్శకత్వ శాఖలో పని చేసినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉంది. చాలా ఆత్మీయంగా పలకరించేవారు. 'చెన్నకేశవరెడ్డి'లో ఆయనతో పాటలు రాయించుకున్నాను. నా 'అదుర్స్' సినిమాలో కామెడీని ఆయన ఎంజాయ్ చేసేవారు. ఆయనతో గడిపిన క్షణాలను ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటాను` అని చెప్పారు వినాయక్‌. 

also read: Sirivennela Death: టాలీవుడ్‌లో విషాదాలు.. నాలుగు రోజులు ముగ్గురు ప్రముఖులు మరణం..

also read: Sirivennela Seetharama Sastry Death: పాటల శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు..

click me!