లారెన్స్ కి అవమానం.. 'లక్ష్మీబాంబ్' నుండి ఔట్!

By AN TeluguFirst Published May 19, 2019, 10:30 AM IST
Highlights

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ 'లక్ష్మీ బాంబ్' ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన 'కాంచన'కు ఇది హిందీ రీమేక్. 

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ 'లక్ష్మీ బాంబ్' ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన 'కాంచన'కు ఇది హిందీ రీమేక్. ఈ సినిమాను లారెన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శనివారం నాడు విడుదల చేశారు.

లారెన్స్ కి చెప్పకుండా ఈ పోస్టర్ రిలీజ్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు. ''గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం.

నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే 'లక్ష్మీబాంబ్' ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలనుకుంటున్నాను'' అంటూ వెల్లడించారు. తను తప్పుకోవడానికి గల కారణాలను చెప్పాలనుకోవడం లేదని.. ఎందుకంటే తను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయని.. వాటిలో ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి అని చెప్పారు.

తన అనుమతి లేకుండా తనతో చర్చించకుండా పోస్టర్ ని విడుదల చేశారని.. తనకు ఈ విషయం మూడో వ్యక్తి ద్వారా తెలిసిందని చెప్పారు. దర్శకుడిగా ఇది తనకు చాలా బాధాకరమైన విషయమని, తనకు పోస్టర్ డిజైన్ కూడా నచ్చలేదని అన్నారు. ఇలాంటి ఘటన ఏ దర్శకుడికి జరగకూడదని అన్నారు.

రీమేక్ సినిమా కాబట్టి స్క్రిప్ట్ వెనక్కి ఇచ్చేయాలని అడగడం లేదని.. అలా అని దర్శకుడిగా సినిమాను కొనసాగించలేనని అన్నారు. తనకు అక్షయ్ కుమార్ సర్ అంటే ఎంతో అభిమానమని.. అందుకే స్క్రిప్ట్ వెనక్కి తీసుకోవాలనుకోవడం లేదని.. వారికి నచ్చిన దర్శకుడిని ఎంచుకోవచ్చని చెప్పారు. త్వరలోనే అక్షయ్ కుమార్ ని కలిసి విషయం చెప్తానని తెలిపారు. 

click me!