
‘పిజ్జా’ సినిమాతో తమిళం వారికే కాకుండా తెలుగువారిని మెప్పించారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. ఆ తర్వాత ఆయన ‘జిగర్ తండ’ (తమిళనాడులో లభించే సోడా) చిత్రంతో స్టార్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ను వదిలారు కార్తీక్. ఇది దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సీక్వెల్ కథ కూడా బాగా అలరించింది. ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా లారెన్స్, దర్శకుడిగా ఎస్.జె.సూర్య చేసిన సందడి జనాలకు బాగా నచ్చింది. ఈ క్రమంలో చాలా మంది ఓటిటిలో చూడటానికి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 8 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇంగ్లీష్‌లో కూడా త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది నెట్‌ఫ్లిక్స్.
కథేంటంటే: కృపాకర్ (ఎస్.జె.సూర్య)కు పోలీస్ అవ్వాలన్నది కల. ఎస్సై పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పోలీస్‌శాఖలో ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు. కానీ, అంతలోనే చేయని తప్పునకు ఓ హత్య కేసులో జైలు పాలవుతాడు. ఆ తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి తనకొక మార్గం దొరుకుతుంది. కర్నూల్‌లోని జిగర్ తండ మర్డర్ క్లబ్ గ్యాంగ్‌స్టర్ సీజర్ (లారెన్స్)ను చంపే ఆపరేషన్‌ను అతని చేతికి అప్పగిస్తారు. తను ఆ పని పూర్తి చేస్తే కేసు నుంచి బయట పడటమే కాకుండా ఎస్సై ఉద్యోగం కూడా తిరిగి పొందగలుగుతాడు. అందుకే ఆ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు తను ఒప్పుకొంటాడు.
సీజర్‌కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి.. దాన్ని అడ్డం పెట్టుకొని రే దాసన్ అనే దర్శకుడిగా అతని దగ్గరకు చేరతాడు. (jigarthanda double x) తనతో పాన్ ఇండియా సినిమా తీస్తానని చెప్పి.. హత్యకు ప్రణాళిక రచిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రే దాసన్ ప్రణాళిక ఫలించిందా? పాన్ ఇండియా తొలి నల్ల హీరోగా పేరు తెచ్చుకోవాలనుకున్న సీజర్ కల నెరవేరిందా? వీళ్ల కథకూ... నల్లమల అడవుల్లో ఏనుగుల్ని చంపి.. దంతాలు తరలించే క్రూరమైన సెటానీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ మొత్తం వ్యవహారం వెనకున్న రాజకీయ కోణమేంటి? అన్నవి మిగతా కథ.