
బాహుబలి 2(Bahubali 2) మూవీతో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాశారు. వెయ్యి కోట్ల వసూళ్లు ఒక ఇండియన్ సినిమాకు సాధ్యమే అని నిరూపించారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు అనేక నయా రికార్డ్స్ సెట్ చేశాయి. బాహుబలి 2 అయితే అన్ని భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇండియా వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 రికార్డు పదిలంగా ఉంది.
అదే సమయంలో భారీ నష్టాలు మిగిల్చిన చిత్రం కూడా ప్రభాస్(Prabhas)ది కావడం దారుణం. రాధే శ్యామ్ ప్రభాస్ పేరిట వరస్ట్ రికార్డు నమోదు చేసింది. అన్ని భాషల్లో కలిపి రాధే శ్యామ్ దాదాపు రూ. 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెండు వందల కోట్లకు పైగా షేర్ రాబడితే గాని బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి. ఈ క్రమంలో మొదటి షో నుండే రాధే శ్యామ్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఓపెనింగ్ డే తో పాటు వీకెండ్ శని, ఆదివారాలు కొంత మేర మెరుగైన వసూళ్లు దక్కించుకుంది.
నెగిటివ్ టాక్ నేపథ్యంలో వీక్ డేస్ మొదలుకాగానే చిత్రం పూర్తిగా నెమ్మదించింది. తెలుగుతో పాటు మిగతా భాషల్లో రాధే శ్యామ్ (Radhe Shyam)వసూళ్లు భారీగా పడిపోయాయి. పది రోజులకు గాను రాధే శ్యామ్ రూ. 202 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో పది రోజులకు వచ్చిన వసూళ్లు కేవలం 50 శాతం కూడా లేవు. తెలుగు తర్వాత హిందీలో ప్రభాస్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. కానీ రాధే శ్యామ్ హిందీ వర్షన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
మొత్తంగా రాధే శ్యామ్ రూ. 100 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. రాధే శ్యామ్ భారతీయ చలన చిత్ర రంగంలో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డు కొట్టింది. తెలుగులో అజ్ఞాతవాసి, స్పైడర్ చిత్రాలు ఈ జాబితాలో టాప్ లో ఉండగా ఆ రెంటినీ అధిగమించి.. రాధే శ్యామ్ మొదటి స్థానం దక్కించుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యామ్ ఫలితాన్ని జీర్ణించుకోలేకున్నారు. అదే సమయంలో రాధే శ్యామ్ ని ఇండస్ట్రీ నుండి ఒక్క హీరో కూడా ప్రమోట్ చేయకుండా, తొక్కేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సాహో, రాధే శ్యామ్ తెలుగు ప్రేక్షకులకు నిరాశ మిగిల్చాయి. కనీసం సాహో హిందీలో విజయం సాధించి ప్రభాస్ పరువు నిలబెట్టింది. సాహో మాత్రం మొత్తంగా ప్రభాస్ ఇమేజ్ దెబ్బతీసింది. విషయం లేని ప్రేమ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా లేకపోవడంతో ఫలితం దెబ్బతీసింది. ఇక నెక్స్ట్ ప్రభాస్ నుండి రానున్న సలార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.