కరోనాతో పోరాటానికి దర్శకుడు సుకుమార్‌ రూ.25లక్షల సాయం..

By Aithagoni RajuFirst Published May 20, 2021, 8:54 PM IST
Highlights

దర్శకుడు సుకుమార్‌ కరోనాతో పోరాటంలో తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రచార ఆర్బాటాలకు అతీతంగా సైలెంట్‌గా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తన సొంత ప్రాంత ప్రజలను ఆదుకుంటున్నారు.

దర్శకుడు సుకుమార్‌ కరోనాతో పోరాటంలో తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రచార ఆర్బాటాలకు అతీతంగా సైలెంట్‌గా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తన సొంత ప్రాంత ప్రజలను ఆదుకుంటున్నారు. రాజోలు మండలం మట్టపర్రుకి చెందిన బండ్రెడ్డి సుకుమార్‌ కోనసీమలో ఆక్సిజన్‌ బెడ్లు దొరక్క అవస్థలు పడుతున్న పేద కోవిడ్‌ రోగుల కోసం తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించనున్నారు. ఇందు కోసం రూ. 25లక్షలు వెచ్చిస్తున్నారు. 

ఇప్పటికే తొలి విడతగా 40 లీటర్ల సామర్థ్యంతో కూడిన నాలుగు ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేసి అమలాపురంలోని అజాద్‌ ఫౌండేషన్‌కి అందజేశారు. అమలాపురంలోని తన స్నేహితుడు పంచాయితీరాజ్‌ డీఈఈ అన్యం రాంబాబుతో చర్చించి ఈ వితరణ కార్యక్రమం చేపట్టారు. సుకుమార్‌ సోదరి, బావ అమలాపురంలో నివాసం ఉంటారు. తన బావ మోపూరి బ్రహ్మాజీకి కోవిడ్‌ పాజిటివ్‌ సోకినప్పుడు కోనసీమలో వైరస్‌ తీవ్రత, ఆక్సిజన్‌ బెడ్లకు ఉన్న డిమాండ్‌ని తన స్నేహితుడు రాంబాబు ద్వారా తెలుసుకున్న ఆయన కోవిడ్‌ రోగులకు తన వంతు సాయంచేయాలన్న తపనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అజాద్‌ ఫౌండేషన్‌ కి సుకుమార్‌ సమకూర్చిన నాలుగు ఆక్సిజన్‌ సిలిండర్లని ఆ ఫౌండేషన్‌ ప్రతినిధులు బుధవారం కోవిడ్‌రోగులకు అందజేశారు. మరిన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల కొనుగోలు చేసి వాటిని కోవిడ్‌ రోగులకు నాలుగైదు రోజుల్లో అందుబాటులోకి తేనున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత వల్ల కోనసీమలో ఆక్సిజన్‌ బెడ్లు, సిలిండర్లు దొరక్క చనిపోయే పరిస్థితులు ఉండకూడదని సుకుమార్‌ చెప్పారు. ప్రభుత్వ చర్యలకు తోడు దాతలు ఇలా తమ వంతు సాయం అందిస్తే త్వరలోనే వైరస్‌ని పూర్తిగా తరిమేయవచ్చని పేర్కొన్నారు. 

click me!