నిర్మాత ఎస్కేఎన్ SKN మళ్లీ తను నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆయన విడుదల చేయబోతున్న మూవీ రిలీజ్ డేట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు.
‘బేబీ’ సినిమాతో నిర్మాత ఎస్కేఎన్ టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. చిన్న సినిమాగా రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఏకంగా రూ.100కోట్ల వరకు ఆ సినిమా కలెక్ట్ చేయడం విశేషం. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆయన చేసిన వ్యాఖ్యలతో SKNకు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ స్పీచ్ లు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఎప్పుడూ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. బేబీ మూవీ విజయంతం తర్వాత మరో నాలుగు ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రస్తుతం ఎస్కేఎన్ నుంచి మరో లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రీసెంట్ ఆయన తండ్రి కన్నుమూయడంతో సినిమా పనులకు కాస్తా బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ‘ట్రూ లవర్’ True Lover అనే సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మాస్ మహారాజా నటించిన ‘ఈగల్’ Eagle Movie విడుదలయ్యే రోజునే తన సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. పైగా అది తమిళ సినిమా కావడం విడుదల చర్చనీయాంశంగా మారింది.
అప్పటికే.. సంక్రాంతి బరి నుంచి రవితేజ ‘ఈగల్’ సినిమాను నిర్మాత మండలి సూచనల మేరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమా రిలీజ్ కు సోలో డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక అదే రోజున ‘ట్రూ లవర్’ సినిమాను తీసుకురాబోతుండటం గమనార్హం. తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డేట్ క్లాష్ పై నిర్మాత ఎస్కేఎన్ ఇలా స్పందించారు..
ఆయన మాట్లాడుతూ... ‘అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి.. పైగా ఇది ఒకేసారి విడుదల కావాల్సిన చిత్రం కావడం విశేషం. తమిళంలో ఏదైనా మార్పులుంటే ఇక్కడ మారొచ్చు. ఇక తెలుగులో వచ్చే పెద్దస్థాయి సినిమాలకు దీనికి పోటీ ఉండదని నా అభిప్రాయం. ఏనుగు, సింహం కోట్లాటలో మాది కుందేలు మాత్రమే.. అందుకే మా స్లాట్ ఉంటుంది’... అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే శివకార్తీకేయన్ ‘ఆయలాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్ కూడా నిలిపివేసిన క్రమంలో ‘ట్రూ లవర్’ పరిస్థితి ఏంటనేది వేచి చూడాలి.