
`ఏపీలో థియేటర్లపై ఆంక్షలు పెడితే నష్టపోయేది పవన్ కళ్యాణ్ కాదు, ఏపీలో ఉన్న థియేటర్ ఓనర్లు మాత్రమే. పవన్‌పై కక్ష్యతో ఏపీలో ఉన్న ఎగ్జిబిటర్ వ్యవస్థని నాశనం చేస్తున్నార`ని అన్నారు నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్వీ ప్రసాద్. పవన్ కళ్యాణపై ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలని, కానీ సినిమా, ఎగ్జిబిటర్ వ్యవస్థపై దాడి చేయడం సరికాదని హితవు పలికారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిని ఉద్దేశించి నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన `భీమ్లా నాయక్` చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. అయితే తెలంగాణ ఈ చిత్రానికి బెనిఫిట్ షోలకు, ఐదు షోలకు అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కూడా ఇచ్చింది. కానీ ఏపీలో మాత్రం ఐదు షోలకు అనుమతి లేదు. టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేకుండా ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఐదు షోలు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతోపాటు థియేటర్ల వద్ద రెవిన్యూ అధికారులు, పోలీసులు గస్తీ కాస్తున్నారు.
ఉదయం పది గంటల వరకు షో వేయడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో తాజాగా దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. థియేటర్ ఓనర్లపై మీరు చేస్తున్న దాడి సరైనది కాదని, ఏపీలో ఉన్న ప్రజలు ఎలా మీవాళ్లు అవుతారో, ఎగ్జిబిటర్లు కూడా మీ వాళ్లే అని తేల్చి చెప్పారు. దయజేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలన్నారు. ఇది పవన్ కళ్యాణ్ పైగానీ, ఆ చిత్ర నిర్మాతలపై గానీ దాడి కాబోదని, ఎగ్జబిటర్లపై దాడిలా ఉందన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, వాళ్లని థియేటర్ల వద్ద కూర్చోపెట్టాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిని ఉద్దేశిస్తూ, మీరు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు మేం ఎంతో సంతోషించాం. మా సమస్యలు తీరిపోతాయని భావించాం. కానీ అలా జరగలేదని, ఇప్పటి వరకూ వచ్చిన మూడు కరోనాల కన్నా తీవ్రంగా ఎగ్జిబిటర్ల వ్యవస్థపై దాడి చేస్తున్నారని, ఇది సినిమా పరిశ్రమపై దాడి కాబోదని, ఏపీలో ఉన్న ఎగ్జిబిటర్ వ్యవస్థపై దాడి చేస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలన్నారు.
ఆంక్షలు విధించడం వల్ల `భీమ్లా నాయక్`, పవన్ కళ్యాణ్‌పై దాడి అనుకుంటున్నారు. పది గంటల వరకూ షో వేయోద్దని నోటీసులిచ్చారు. దానికి అనుగుణంగా మేం ఉన్నామని, పది గంటల లోపు సినిమా వేసే అధికారం ఎవ్వరికీ లేదని, కానీ అధికారులు మళ్లీ థియేటర్లపై దాడి చేయడం ఎంత వరకూ న్యాయం, ఏపీలో ఉన్న సినమా ఎగ్జిబిటర్లని ఏం చేయాలనుకుంటున్నారో ఓపెన్‌గా చెప్పేయండి. పవన్ పై దాడి చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగతం. రాజకీయంగా చూసుకోండి. కానీ థియేటర్ల వ్యవస్థపై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. థియేటర్ల ఓనర్లు ఏం చేశారని వారిని ఇలా చేస్తున్నారు, ఈ దాడుల వల్ల పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి ఉండదని, మంత్రి గారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు.