సోషల్ మీడియాలో వేధింపులు.. గూగుల్ సీఈవో కి నిర్మాత బన్నీ వాసు లేఖ!

By team teluguFirst Published Jul 25, 2021, 5:04 PM IST
Highlights

సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వేధింపులు ఎదురవుతున్నాయని స్వయంగా ఓ లేఖ విడుదల చేశాడు బన్నీ వాసు. ఆ లేఖ నేరుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ని ఉద్దేశించి రాయడం విశేషం. 
 

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీస్సులతో, స్టార్ అల్లు అర్జున్ అండదండలతో పరిశ్రమలో నిర్మాతగా నిలబడ్డాడు బన్నీ వాసు. 100% లవ్, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజూ పండగే వంటి బ్లాక్ బస్టర్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. సక్సెస్ నిర్మాతగా కొనసాగుతున్న ఈయన జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. కొందరు మహిళల నుండి బన్నీ వాసు లైంగిక, చీటింగ్ ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. కాగా తనకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వేధింపులు ఎదురవుతున్నాయని స్వయంగా ఓ లేఖ విడుదల చేశాడు బన్నీ వాసు. ఆ లేఖ నేరుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ని ఉద్దేశించి రాయడం విశేషం. 


సామాజిక మాధ్యమాల వల్ల కొన్ని కుటుంబాలు ఎంతటి ఒత్తిడికి లోనవుతున్నాయో బన్నీ వాసు ఉదాహరణ పూరితంగా వివరించారు. సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి చేస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల తాను, తన కుటుంబం తీవ్ర వేదనను అనుభవిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటర్నెట్ స్వేచ్ఛపై తన అనుభవాన్ని ఆ లేఖలో ఆయన వివరించారు. తన కూతుర్ని చంపుతామంటూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోను తీయించడానికి తానా తీవ్ర ఇబ్బందులు పడ్డానని ఆయన లేఖలో వివరించారు. ఇంటర్‌నెట్‌ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల పిచాయ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 


తాను కూడా తొలుత సామాజిక మీడియా స్వేచ్ఛకు హద్దులు ఉండరాదని అనుకునేవాడినని, కాని గత రెండేళ్ళుగా సామాజిక మాధ్యమాల తీరు చూశాక. తన అభిప్రాయం మారిందన్నారు. సోషల్ మీడియాలో తనను బెదిరించిన వ్యక్తిపై చర్యల కోసం పోలీసుల కంటే సామాజిక మాధ్యమాల సెల్‌కే ఎక్కువ ఫిర్యాదులు చేశానని బన్నీ వాసు లేఖలో తెలిపారు. ఒకరు ప్రచురించిన పోస్టు లేదా న్యూస్ అబద్ధమని నిరూపించడానికి సామాజిక మాధ్యమాల కంటే కోర్టుల్లోనే సులువని ఆయన పేర్కొన్నారు. అబద్ధాలు, అసత్యాలను పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని. అలాంటి వారిని సోషల్ మీడియా సంస్థలు నియంత్రించడం లేదన్నారు. బన్నీ వాసు లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

click me!