
తమిళ దర్శకుడు, చిత్ర నిర్మాత భారతీరాజా (Bharathiraja) తాజాగా అస్వస్థతకు గురయ్యాడు. కొన్ని నెలలుగా ఆయన సినీ పనుల్లో భాగంగా ప్రయాణాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు మధురైలోని ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ఉన్నట్టుండి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన్ను గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని,బిజీ వర్క్ షెడ్యూల్ వల్ల, అజీర్ణం కారణంగా స్పృహ తప్పి పడిపోయాడని వైద్యులు వెల్లడించారు. కాస్తా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు.
భారతి రాజాకు ప్రస్తుతం 79 ఏండ్లు నిండాయి. అయినా ఆయనకు సినిమాలపై ఉన్న మక్కువతో ప్రస్తుతం ఆయా చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో బిజీ షెడ్యూల్ ను ఫాలో అవుతున్నారు. వయస్సు మీదపడటం, వర్క్ ప్రెజర్ పెరగడంతో అస్వస్థతకు గురయ్యారు. భారతి రాజా తాజాగా సూపర్ హిట్ ఫిల్మ్ ‘తిరుచిత్రంబలం’ (Thiruchitrambalam)లో సపోర్టింగ్ రోల్ లో నటించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో తమిళ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush), హీరోయిన్ నిత్యామీనన్ కలిసి నటించారు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన దక్కుతోంది.
వృత్తిపరంగా భారతీరాజా తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ చిత్రనిర్మాతలలో ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన 1977లోనే రొమాంటిక్ డ్రామా ‘16 వయత్తినిలే’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చిత్రనిర్మాతగానూ తన మార్క్ చూపించాడు. ఆయన చిత్రాల్లో ఎక్కువగా గ్రామీణ జీవివనం, వాస్తవిక మరియు సున్నితమైన చిత్రీకరణ ఉంటుంది. 2017లో భారతీ రాజా 6 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ నుంచి అందుకున్నారు. అలాగే నంది అవార్డును గెలుచుకున్నాడు. చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 2004లో భారతదేశపు నాల్గో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.