
ప్రభాస్(Prabhas) హోం బ్యానర్ `యూవీ క్రియేషన్స్`(UV Creation)పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా `#BoycottUvCreations` అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ యాష్ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. Prabhasకి తెరవెనుక అతిపెద్ద విలన్ యూవీ క్రియేషనే అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు తెలుగులో వరెస్ట్ బ్యానర్ ఏదో చెప్పండి అంటూ కాంటెస్ట్ పెడుతున్నారు. మొత్తంగా ఇప్పుడు `#BoycottUvCreations` అనేది ట్విట్టర్‌లో మోత మోగిపోతుంది.
మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ స్థాయిలో ఊగిపోవడానికి, ఆయన సొంతం బ్యానర్‌నే ఈ స్థాయిలో ట్రోల్ చేయడానికి కారణం `రాధేశ్యామ్`(Radheshyam) అని తెలుస్తుంది. ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 11న విడుదల కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. Radheshyam సినిమా రిలీజ్‌కి ఇరవై రోజులు కూడా లేవు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి కొత్తగా ఎలాంటి అప్‌డేట్ లేదు. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదైనా అప్‌డేట్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.
కానీ `రాధేశ్యామ్` నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అది సరికదా, రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ఇంకా ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయలేదు. దీంతో డార్లింగ్ అభిమానులకు చిర్రెత్తిపోతుందట. తమలోని అసంతృప్తిని తట్టుకోలేక ఇలా `#BoycottUvCreations` పేరుతో ట్రోల్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలాగైనా చలనం వస్తుందేమో అని వారు ఆవేదన చెందుతున్నారు. నిజానికి అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే అప్‌డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. కానీ `రాధేశ్యామ్` విషయంలో నిర్మాణ సంస్థ ఇంకా మౌనం వహిస్తుండటం పట్ల డార్లింగ్ అభిమానులు ఈ రూపంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. పాటలు కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నిజానికి జనవరి 14న విడుదల చేయాలనుకున్నారు.కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎట్టకేలకు మార్చి 11న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. యూవీక్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రేమకి, విధికి మధ్య సాగే ఫైటింగ్ నేపథ్యంలో ఈచిత్ర కథ సాగుతుందని టాక్.