
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయకుడు కన్నుమూశారు. మలయాళం చిత్ర పరిశ్రమకి చెందిన గాయకుడు ఎడవ బషీర్(78) గుండెపోటుతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఒక మ్యూజిక్‌లైవ్ కాన్సర్ట్ లో పాట పాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పాటపాడుతుండగానే స్ట్రోక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బషీర్ కన్నుమూసినట్టు వైద్యులు నిర్ధారించారు.
కేరళాలోని అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట‍్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బషీర్ ప్రదర్శన ఇస్తున్నారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు పాడిన `మానే హో తుమ్` అనే హిందీ సాంగ్‌ను ఆలపిస్తుండంగా ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఛాతీ నొప్పి భరించలేక స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు బషీర్. ఈ సంఘటన శనివారం రాత్రి 9:30 గంటలకు చోటు చేసుకుంది. గాయకుడు ఎడవ బషీర్ 'గాన మేళా'తో ఎంతో పాపులర్ అయ్యారు.
తిరువనంతపురం జిల్లాలోని వర్కాలకు సమీపంలో ఉన్న ఎడవ అనే ప్రాంతంలో బషీర్ జన్మించారు.స్వాతి తిరునాళ్ మ్యూజిక్ అకాడమీ నుంచి అకాడమిక్ డిగ్రీ 'గానభూషణం' అభ్యసించారు. అనంతరం 1972లో కొల్లంలో 'సంగీతాలయ' గాన మేళాన్ని స్థాపించారు. దీంతోపాటు `రఘువంశం` అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. ఆల్ కేరళ మ్యూజిషియన్స్ అండ్ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు భార్యలు రషీదా, రెహ్నా, పిల్లలు ఉల్లాస్, బీమా, ఉమేశ్, ఉషుస్ సీత్తా ఉన్నారు.