
బండ్ల గణేష్ (Bandla Ganesh)కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ భక్తుడు. బండ్ల గణేష్ గురించి తెలిసినవారెవరైనా ఇలాగే పరిచయం చేస్తారు. పవన్ ఆయనకున్న వ్యసనం. పవన్ కిక్ తలకెక్కితే బండ్ల నోటి నుండి వచ్చే పాదాల వెల్లువ ఆపడం ఎవరి తరం కాదు. ప్రపంచంలోని గొప్ప గొప్ప పదాలు కూర్చి పవన్ కి ఎవరెస్ట్ రేంజ్ ఎలివేషన్ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ సినిమా వేడుకల్లో బండ్ల గణేష్ స్పీచ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పవన్ అభిమానులు బండ్ల గణేష్ స్పీచ్ కోసం ప్రత్యేకంగా ఎదురుచూస్తారు. తన దేవుడు పవన్ ని అంతగా ఆరాధించే బండ్ల గణేష్ ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భీమ్లా నాయక్ (Bheemla Nayak)ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి సాటి పవన్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో బయటికి వచ్చింది.
సదరు ఆడియో క్లిప్ లో బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు నన్ను రాకుండా త్రివిక్రమ్ అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. లీకైన ఫోన్ సంభాషణలో ఉన్నట్లే బండ్ల గణేష్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించలేదు. ఈ ఆడియో రికార్డు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. అది ఎవరో గిట్టనివారు సృష్టించింది. ఆడియోలో ఉన్నది నా వాయిస్ కాదు, నేను మాట్లాడలేదన్నారు.
బండ్ల గణేష్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఈ ఆడియో రికార్డు పవన్ (Pawan Kalyan)కి ఆయనను దూరం చేసినట్లు కొందరు నమ్ముతున్నారు. బండ్ల గణేష్ పై పవన్ కోపంగా ఉన్నట్లు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు వాస్తవం అనేలా బండ్ల గణేష్ తాజా ట్వీట్ ఉంది. బండ్ల తన లేటెస్ట్ ట్వీట్ లో... 'ఈ జన్మంతా నీ ప్రేమ లోనే మీ అభిమానంతోనే దారిలో ఎంతమంది అడ్డొచ్చినా ఎప్పటికీ మిమ్మల్ని పూజిస్తూ ఈ బండ్ల గణేష్' అంటూ పవన్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ లో మనం గమనించాల్సిన మరొక పదం.. 'ఎంత మంది అడ్డొచ్చినా..'.
బండ్ల ట్వీట్ చేసిన ఆ పదం పరోక్షంగా ఆయన ఇన్నర్ ఫీలింగ్ తెలియజేస్తుంది. ఎవరో తనను కావాలనే పవన్ కి దూరం చేస్తున్నారని, వారిద్దరికీ మధ్య దూరం పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. లీకైన ఆడియోలో ఆరోపణలకు ఈ ట్వీట్ కి చాలా దగ్గర మీనింగ్ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కి అత్యంత ఆప్తుడు, మిత్రుడైన త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ పరోక్షంగా ఆరోపణలు చేసినట్లుగా ఉంది. త్రివిక్రమ్ అయినా మరెవరైనా పవన్ పై బండ్లకు ఉన్న భక్తి దూరం చేయలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారి బండ్ల గణేష్, పవన్ కి కలిస్తే ఈ అనుమానాలకు సమాధానం దొరుకుతుంది.