
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలో అర్జున్ దాస్ ఓ ట్వీట్ చేయగా అది వైరల్ అయ్యింది. ఆ ట్వీట్ కు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త ఎమోషనల్ రిప్లై ఇచ్చారు.
ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ దాస్ తన అధికారిక X ఖాతా ద్వారా వెల్లడించారు. “పవన్ కళ్యాణ్ గారు వారి సినిమా ట్రైలర్‌కు నా గొంతు కావాలని కోరారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఒప్పుకోవాలి కదా. ఇది మీకోసమే సార్. మీకు, మీ టీంకు నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు అర్జున్ దాస్. ఈ ట్వీట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్… అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేస్తూ, “ప్రియమైన సోదరుడు అర్జున్ దాస్, నీకు నేను రుణపడి ఉంటాను. నేను ఎవరినైనా సహాయం కోరడం చాలా అరుదుగా జరుగుతుంది. నా అభ్యర్థనను గౌరవించి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. నీ గొంతులో అద్భుతమైన మ్యాజిక్ ఉంది… మెలోడీ ఉంది” అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.
అర్జున్ దాస్ గొంతుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తక్కువ కాలంలోనే ఆయన వాయిస్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా ‘కైతి’, ‘మాస్టర్’ వంటి తమిళ చిత్రాల్లో ఆయన వాయిస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు అదే గొంతు పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్‌కు వాయిస్ ఇవ్వడంతో అర్జున్ దాస్ మరింత ఫేమస్ అయ్యారు.
ఇక ‘హరిహర వీరమల్లు’ సినిమాకు గతంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ప్రస్తుతం జ్యోతి కృష్ణ ఈమూవీని రూపొందిస్తున్నారు. . మెగా సుర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొఘల్ సామ్రాజ్యంలో జరిగే ఒక కల్పిత కథానాయకుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా గతంలోనే అనేకసార్లు వాయిదా పడింది. అయితే ఇటీవలే పవన్ రాజకీయంగా విజయాన్ని అందుకోవడం, ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడం నేపథ్యంలో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎంత బిజీగా ఉన్నా.. రీసెంట్ గా పవన్ తన షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరగుతున్నాయి. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ట్రైలర్‌కి జతకావడంతో సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి.