కల్మషం లేని మనిషి..జీర్ణించుకోలేకపోతున్నాంః పవన్‌, సమంత, సూర్య, రాజశేఖర్‌ భావోద్వేగం..

By Aithagoni RajuFirst Published May 22, 2021, 3:38 PM IST
Highlights

జర్నలిస్ట్, నిర్మాత బి.ఏ.రాజు మరణం తనని దిగ్ర్భాంతికి గురి చేసిందని అన్నారు పవన్‌ కళ్యాణ్‌. ఎలాంటి కల్మషం లేని మనిషి అన్నారు జీవితా, రాజశేఖర్‌, తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అన్నారు సమంత. 

జర్నలిస్ట్, నిర్మాత బి.ఏ.రాజు మరణం తనని దిగ్ర్భాంతికి గురి చేసిందని అన్నారు పవన్‌ కళ్యాణ్‌. ఎలాంటి కల్మషం లేని మనిషి అన్నారు జీవితా, రాజశేఖర్‌, తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అన్నారు సమంత. పరిశ్రమలో అందరికి ఆప్తుడన్నారు ఆర్‌ నారాయణ మూర్తి. బి.ఏ.రాజుకి సినీ లోకం సంతాపాలు తెలియజేస్తుంది. ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. బి.ఏ.రాజు శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు. `జర్నలిస్ట్ గా,  పీఆర్‌ఓగా తెలుగు సినీ రంగంలో చిరపరిచితులైన బి.ఏ.రాజు మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయనతో చెన్నైలో ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. సినిమా అంటే ఎంతో తపన కలిగిన జర్నలిస్ట్ ఆయన. అన్నయ్య చిరంజీవి సినిమాలకు పీఆర్వోగా చేశారు. సూపర్‌హిట్‌ పత్రిక సంపాదకులుగానే కాకుండా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలబడ్డారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని అన్నారు. 

సమంత ట్వీట్‌ చేస్తూ, `నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. తొలి సినిమా నుంచి ఇప్పటివరకూ ప్రతి ప్రాజెక్ట్‌.. అది హిట్టైనా ఫ్లాపైనా ఆయన ఎంతో సపోర్ట్‌ అందించేవారు. రాజుగారి మరణం ఎప్పటికీ తీరని లోటు` అని తెలిపింది. 

సూర్య చెబుతూ, `మా మీద విపరీతమైన ప్రేమ చూపించే రాజుగారు వృత్తి పరమైనా అనుబంధాన్ని వ్యక్తిగత బంధంగా మార్చేశారు. ఆయన లేరనే వార్త చాలా బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా` అని చెప్పారు. విక్రమ్‌ మాట్లాడుతూ, `మంచి స్నేహితుణ్ణి కోల్పోయా! నా తమిళ, తెలుగు సినిమాలకు వారధిలా నిలిచారు. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి` అని అన్నారు.

రాజశేఖర్, జీవిత దంపతులు మాట్లాడుతూ, `తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల నుంచి మాకు బీఏ రాజుగారితో పరిచయం ఉంది. ఎటువంటి కల్మషం లేని మంచి మనిషి. మేం నటించిన చాలా చిత్రాలకు ఆయన పీఆర్వో చేశారు. మాకు పర్సనల్ పీఆర్వోగానూ పని చేశారు. కొన్నేళ్లు రాజశేఖర్ గారి డేట్లు చూశారు. తరచూ మేం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పటికీ మా కొత్త సినిమాలు వస్తే ఫోన్స్ చేసి మాట్లాడతారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. మా పిల్లల సినిమాలపై కూడా అదే శ్రద్ధ చూపించారు. మాకు అండగా ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. బీఏ రాజు మరణం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది. ఎంతో బాధగా ఉంది. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు రాజుగారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్లకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని అన్నారు.

`1980వ దశకం లో మద్రాస్ లో నాకు బి ఏ రాజు గారు పరిచయం. హిరో కృష్ణ గారికి వీరాభిమానిగా, పాత్రికేయుడిగా, సిని పబ్లిసిటీ ఇంఛార్జిగా, సూపర్ హిట్ వార పత్రిక అధినేతగా, అన్నింటికీ మించి సిని పరిశ్రమ తలలోని నాలుక లా అందరి అప్తుడుగా, సిని నిర్మాతగా అయన చేసిన సేవలు అమోఘం. బి ఏ రాజు గారి మరణం సిని పరిశ్రమ కు ముఖ్యంగా పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను` అని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.

click me!