
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) హీరోగా నటించిన సినిమా మేజర్. 26/11ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం గత శుక్రవారం (జూన్ 3)న విడుదలై సంచలన విజయం సాధించింది. మేజర్ పాత్రలో అడివి శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అభిమానులే కాకుండా సినీ స్టార్స్ కూడా చిత్రానికి వస్తున్నరెస్పాన్స్ పై అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) చిత్ర యూనిట్ కు అభినందించారు.
ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘మేజర్’టీంను స్పెషల్ గా అభినందించారు. ఇంతమంచి సినిమాను రూపొందించినందుకు చిత్రబృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశాడు. తాజాగా పవన్ కళ్యాన్ కూడా స్పందిస్తూ సుధీర్ఘమైన నోట్ రాశారు.... ‘‘మేజర్’ చిత్ర బృందానికి అభినందనలు. అడివి శేష్ లాంటి సృజనశీలురు మరింత మంది చిత్రసీమకు రావాలి. ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008లో ఉగ్రవాదుల దాడులకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమరుడయ్యాడు. ఆయన వీర మరణాన్ని వెండి తెరపై ‘మేజర్’గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందంగా ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. జనసేన పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రాన్ని వీక్షిస్తాను. ‘మేజర్’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్ బాబు (Mahesh Babu),చిత్ర నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలకు శుభాకాంక్షలు. నటీనటులు అడివిశేష్, ప్రకాష్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు... మీ పవన్ కళ్యాణ్’ అంటూ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హైటెక్ సిటీలోని శిల్పా కళా వేదికలో జరిగిన ఈవెంట్ కు పవర్ స్టార్ రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ ఒక కుటుంబానికి సంబంధించి కాదు.. అందరిదీ అన్నారు. నా వంతుగా ప్రతి సినిమాను ప్రోత్సహిస్తానని చెప్పారు. ప్రస్తుతం ‘మేజర్’ చిత్ర యూనిట్ ను అభినందించారు. ఇలా మంచి సినిమాలపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ అభిమానులు, ప్రేక్షకుల గుండెల్లో మరింత చోటు సంపాదిస్తున్నారు.