
పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ లు నటించిన చిత్రం బ్రో సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతికు వేసిన డాన్స్ తరహాలాంటిదే బ్రో సినిమా లో పెట్టడం వివాదానికి మూలం అయ్యింది. ఈ వివాదం రోజు రోజుకూ సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా మీడియాలోనూ చర్చగా మారుతోంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వివాదం గురించి మాట్లాడారు. సినిమాను రాజకీయాల్లోకి తేవొద్దని జనసైనికులకు పవన్ విజ్ఞప్తి చేశారు. అభిమానులు రియాక్ట్ అయితే వేరని, కానీ,పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు సినిమా డిబేట్‌లోకి వెళ్తే ఎలా? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... రాజకీయాలను రాజకీయాలుగానే చూడండి, ఇక్కడకు సినిమాను తీసుకురాకండి అంటూ హెచ్చరించారు. నేను రాజకీయంగా నడవాలంటే నాకు సరైన ఇంధనం సినిమానే అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు పవన్. నా సినిమాల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతారు అది కేవలం సమస్యను డైవర్ట్ చేయడానికి మాత్రమే..డిబేట్ స్థాయి పెంచాలని, అవతలి వారి స్థాయికి దిగజారవద్దని కోరారు. వారు చెప్పిన దానికి సరైన సమాధానం చెప్పాలని, వివాదాల జోలికి పోవద్దని హితవు పలికారు.
వైసీపీ నాయకులు ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలు మహిళల అదృశ్యం, పోలవరం, చిన్నారుల ట్రాఫికింగ్ వంటి అంశాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తారు, కానీ జనసైనికులుగా మీరు నిజంగా రాష్ట్రానికి మంచి చేయాలి అనుకుంటే ఈ సమస్యల గురించి మాట్లాడండి.. ప్రజల్లో అవగాహన తీసుకురండి అంటూ సొంత పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు పవన్.
తన చుట్టూ తిరిగితే లీడర్లు కారని, కలిసిన వారినే మళ్లీ మళ్లీ కలవడం వల్ల తనకు సమయం వృథా అవుతోందని చెప్పారు. రాజకీయాల్లో తనకు సినిమానే ఇంధనమని, దానిని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్నానని అన్నారు. ముందస్తు ఎన్నికలకు జనసేన కేడర్ రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ పెట్టడం, నడపడం అంత సులువు కాదని చెప్పారు. విలువలతో రాజకీయాలు చేయాలంటే భయపడే పరిస్థితిని వైసీపీ కల్పించిందని అన్నారు. గతంలోనూ ఈ ధోరణి ఉన్నా… వైసీపీ వచ్చాక విశ్వరూపం కనిపించిందని చెప్పారు.
రాజకీయం చేయాలంటే దోపిడీ, దౌర్జన్యం, పిచ్చిగా కారుకూతలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి అన్న రీతిలో పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జనం తమ వెంట నడవాలంటే త్యాగం, బాధ్యత, జవాబుదారితనం ఉండాలని అన్నారు. సీట్ల కోసం ఏ రోజు ఎవరూ డబ్బులు తీసుకోకూడదన్నారు. ఓటర్లకు డబ్బులు ఇస్తే మాత్రం ఆ తప్పు మీదే అని అన్నారు. పవన్ తో మాట్లాడి పదవి ఇప్పిస్తాం అని డబ్బులు తీసుకుంటే.. అలాంటి వారిని పక్కన పెట్టాలని సూచించారు.
అయితే, ఎన్నికల కసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఐడియాలజీ ఉన్నవారు ఇతర పార్టీలో ఉన్నా వారిని ఆహ్వానిస్తామన్నారు. మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే దుష్టపాలకుడి మీద అన్నారు పవన్. ఇది గుర్తించకుండా మీరు కూడా ఎందుకు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు అంటూ పవన్ జనసైనికులను ఉద్దేశించి మాట్లాడారు. బ్రో ఒక సినిమా మాత్రమే దాని గురించి మీరెవ్వరూ మాట్లాడొద్దు అంటూ ఆదేశించారు పవన్.