
టాలీవుడ్ పై మరోసారి కోవిడ్ పంజా విసురుతోంది. వరుసగా సెలెబ్రిటీలు కోవిడ్ బారీన పడుతున్నారు. సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటులు కోవిడ్ కారణంగా ఆసుపత్రి పాలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత కరోనా పరిస్థితులు టాలీవుడ్ చిత్రాల షూటింగ్స్ కి కూడా ఇబ్బందికరంగా మారింది. పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. గత ఏడాది సెకండ్ వేవ్ కారణంగా హరిహర వీరమల్లు షూటింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత పవన్ భీమ్లా నాయక్ కోసం ఎక్కువ టైం కేటాయించడంతో హరిహర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు. ఇప్పుడు భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తయింది.
దీనితో జనవరి నుంచి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ తో షూట్ రీ స్టార్ట్ చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం థర్డ్ వేవ్ తీవ్రంగా మారుతోంది. దీనితో ఈ నెలలో షూటింగ్ వద్దని పవన్ దర్శక నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గాక ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించాలని సూచించినట్లు సమాచారం.
గత ఏడాది సెకండ్ వేవ్ టైంలో పవన్ కళ్యాణ్ కోవిడ్ కి గురై కోలుకున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ , రానా కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావలసింది. కానీ అనూహ్యంగా వాయిదా పడడం, కోవిడ్ పుంజుకోవడం అందరికి నిరాశ కలిగించే అంశం.